శ్రీకాకుళం వైసీపీ ఎంపీ కోసం వేట…!

శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గంపైన వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. వరుసగా రెండుసార్లు ఓడిన నియోజకవర్గాన్ని ఈసారి ఎలాగైనా గెలుచుకోవాలనే పట్టుదలతో జగన్ మోహన్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. 2014లో తొలిసారి పార్లమెంట్‌లో అడుగుపెట్టిన కింజరాపు రామ్మోహన్ నాయుడు… ప్రస్తుతం జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో రామూను ఓడించాలంటే అంతే స్థాయి నేత ఉండాలనేది జగన్ ఆలోచన. 2014లో వైసీపీ తరఫున పోటీ చేసిన రెడ్డి శాంతి… ప్రస్తుతం పాతపట్నం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 2019లో పోటీ చేసిన దువ్వాడ శ్రీనివాస్… ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇక ఆయన భార్యను టెక్కలి నియోజకవర్గం ఇంఛార్జ్‌గా నియమించారు జగన్. దీంతో రాబోయే ఎన్నికల్లో మరోసారి కొత్త అభ్యర్థి దాదాపు ఖాయమైనట్లే తెలుస్తుంది.

శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఎలాగైనా సరే గెలవాలని భావించిన జగన్.. ఆ బాధ్యతను జిల్లాకు చెందిన సీనియర్ నేతలకు అప్పగించినట్లు తెలుస్తోంది. ధర్మాన సోదరులతో పాటు స్పీకర్ తమ్మినేని సీతారాంకు పార్లమెంట్ గెలిపించాలని సూచించినట్లు సమాచారం. దీంతో ఇప్పుడు ముగ్గురు నేతలు భేటీ అవ్వడం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. వాస్తవానికి రాబోయే ఎన్నికల్లో ఈ ముగ్గురు నేతలు తమ వారసులను అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలపాలని భావిస్తున్నారు. దీని గురించి ఇప్పటికే జగన్ దగ్గర కూడా ప్రపోజల్ పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఇందుకు బదులుగా వీరిలో ఒకరిని పార్లమెంట్ బరిలో దింపాలని జగన్ సూచించినట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ ముగ్గురు ఇప్పుడు ఎవరి పోటీ చేయాలనే అంశంపై మల్లగుల్లాలు పడుతున్నట్లుగా సమాచారం.

వాస్తవానికి జిల్లాలో సీనియర్ నేతగా గుర్తింపు తెచ్చుకున్న మంత్రి ధర్మాన ప్రసాదరావు ఈ సారి శ్రీకుకాళం అసెంబ్లీ బరిలో తన కుమారుడు రామ్ మనోహర్ నాయుడును దింపాలని భావిస్తున్నారు. నియోజకవర్గంలో ఇప్పటికో ధర్మాన యూత్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఇక నియోజకవర్గం పార్టీ కార్యక్రమాల్లో సైతం రామ్ మనోహర్ నాయుడే ఎక్కువగా పాల్గొంటున్నారు. అటు తమ్మినేని కూడా ఈసారి ఎన్నికల్లో తన వారసుడిని పోటీ చేయించాలని భావిస్తున్నారు. అందుకే జిల్లా పరిషత్ సమావేశాల్లో కూడా తమ్మినేని కుమారుడు వేదికపైనే ఉంటున్నారు. ఎంపీ రామ్మోహన్ నాయుడును ఓడించాలంటే ఆ స్థాయిలో మాటలతో ఆకట్టుకోగల నేత కావాలనేది సిక్కోలు వాసుల మాట. మరి ఈసారి సిక్కోలు వైసీపీ ఎంపీగా ఎవరు పోటీ చేస్తారో చూడాలి.