కలహాల కమలం..వరుస పంచాయితీలు..తేలని పదవులు.!

కాంగ్రెస్ పార్టీ అంటే ఆధిపత్య పోరుకు పెట్టింది పేరు. ఎక్కడైనా అంతర్గతంగా పోరు ఉంటుంది..కానీ కాంగ్రెస్ లో మాత్రం బహిరంగంగానే పోరు ఉంటుంది. పార్టీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటారు. అలా చేయడం వల్లే పార్టీకి నష్టం జరుగుతుంది. అయితే ఇటీవల కాంగ్రెస్ లో అలాంటి రచ్చ కాస్త తగ్గింది..ఇప్పుడు బి‌జే‌పిలో మొదలైంది. బి‌జే‌పిలో ఇలాంటి పోరు పెద్దగా జరగదు. ఏమైనా ఉన్న అధిష్టానం సర్ది చెప్పేస్తుంది.

కానీ తెలంగాణ బి‌జే‌పిలో ఇప్పుడు ఆ పరిస్తితి లేదు..నేతలు వీధికెక్కారు. విమర్శలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని టార్గెట్ చేశారు. ఇప్పటికే బండితో ఈటల రాజేందర్‌కు పంచాయితీ ఉంది..ఆ ఇద్దరు నేతలకు పడటం లేదు. పరోక్షంగా ఒకరినొకరు చెక్ పెట్టుకోవాలని చూస్తున్నారు. అయితే బహిరంగంగా విమర్శలు చేసుకోలేదు.కానీ ఇటీవల జితేందర్ రెడ్డి..బండిని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు. రాష్ట్ర నాయకత్వానికి మంచి ట్రీట్‌మెంట్ కావాలని ట్వీట్ చేశారు. ఇది కాస్త వివాదాస్పదం అవ్వడంతో జితేందర్ మాట మార్చారు. తన మాటలని వక్రీకరించారని అన్నారు.

ఇదే సమయంలో బి‌జే‌పి ఎమ్మెల్యే రఘునందన్ ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి బండిని ఏకి పారేశారు. బండికి కళ్ళు నెత్తికెక్కి అహంకారం ఎక్కువైందని, అందరినీ కలుపుకుని వెళ్లరని ఫైర్ అయ్యారు. తాను దుబ్బాకలో ఒక పువ్వు గుర్తుతోనే గెలవలేదని, తన ఇమేజ్ తో గెలిచానని, తనకు ఎవరూ ఒక్క రూపాయి ఇవ్వలేదని అన్నారు.  ఇలా బండిపై ఫైర్ అయ్యి..మళ్ళీ వెంటనే మాట మార్చేశారు.తన మాటలని మీడియా వక్రీకరిస్తుందని, తాను, కమలం గుర్తు వేర్వేరు కాదని చెప్పుకొచ్చారు.

ఈ రచ్చ ఇలా ఉండగానే…బండిని మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఆయన్ని అధ్యక్ష పదవి నుంచి తప్పించి కేంద్ర మంత్రి పదవి ఇస్తారని, కిషన్ రెడ్డికి అధ్యక్ష పదవి ఇస్తారని, ఈటలకు ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్ పదవి ఇస్తారని ప్రచారం వస్తుంది. కానీ ఇంతవరకు పదవులు తేలలేదు.