రాంగ్ ట్రాక్‌లో వెళ్తున్న జనసేనాని… ఇలా అయితే అయినట్లే…?

పవన్ కల్యాణ్… సినిమా హీరో కంటే కూడా జనసేన పార్టీ అధినేతగానే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్నారు. ఆయన ఇప్పుడు ఎక్కడ మీటింగ్ పెట్టినా సరే.. జగన్ తండోపతండాలుగా వస్తున్నారు. ర్యాలీలు, చప్పట్లు… సీఎం సీఎం అంటూ నినాదాలు… అంతా బాగానే ఉంది కానీ… అసలు జనసేన పార్టీ నేతలెవరు… పవన్ కాకుండా ఆ పార్టీలో ఇతర నేతలెవరైనా ఉన్నారా… ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఓడించడమే లక్ష్యమని ఇప్పటికే పవన్ పలుమార్లు ప్రకటించారు. ఇందుకోసం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ప్రతిపక్షాలు కలిసి పోటీ చేసేలా తన వంతు ప్రయత్నం చేస్తానని కూడా పవన్ వెల్లడించారు. ఇప్పటికే ఎన్‌డీయేలో చేరిన పవన్… తమతో పాటు టీడీపీని కలుపుకుని వెళ్తామన్నారు.

ఇక పవన్ ప్రస్తుతం అనుసరిస్తున్న వ్యూహాలు రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తున్నాయి. కనీసం గుర్తు కూడా లేని పార్టీతో ఎన్నికల్లో పోటీకి సై అంటున్న పవన్… ప్రభుత్వంపైన, వైసీపీ అధినేతపైన విమర్శలు చేస్తున్నారు. అసలు పవన్ చేసినన్ని ఆరోపణలు… ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నేతలు కూడా చేయలేదు కూడా. టీడీపీ నేతలు సైలెంట్‌గా ఉంటే… పవన్ మాత్రం తగ్గేదే లే అన్నట్లుగా దూకుడుగా ఉన్నారు. దీంతో రాష్ట్రంలో వైసీపీ వర్సస్ జనసేన అన్నట్లుగానే పరిస్థితి మారిపోయింది. అయితే ఇక్కడే అసలు సమస్య తలెత్తుతోంది.

అయితే పవన్ వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారాహి యాత్ర పేరుతో ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాలను చుట్టేసిన పవన్… త్వరలో కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర పర్యటనకు కూడా రెడీ అవుతున్నారు. అన్నవరం నుంచి మొదలైన యాత్ర… ఏలూరు వరకు సాగింది. ఈ యాత్రలో ప్రభుత్వంపై పవన్ ఎన్నో విమర్శలు చేశారు. ఇక ఏలూరు సభలో అయితే వలంటీర్ వ్యవస్థపైనే ఆరోపణలు చేశారు. దీంతో పవన్‌కు కావాల్సినంత పబ్లిసిటీ వచ్చిందనే చెప్పాలి. కానీ… పవన్ తర్వాత… ఆ పార్టీలో ఉన్న నేత ఎవరూ… వారాహి వాహనంపై పవన్ ప్రసంగిస్తున్న సమయంలో ఇతర నేతలెవరూ ఎందుకు లేరు…. కనీసం ఆయా నియోజకవర్గం ఇంఛార్జ్, కీలక నేత అయినా వేదిక పైకి ఎందుకు రాలేదు… సభ ఏర్పాటు చేసిన నేత పేరు చెబుతున్నారు సరే.. ఆ తర్వాత మాత్రం ఇతర విషయాలే ప్రస్తావిస్తున్నారు. దీంతో వారాహి యాత్ర మొత్తం పవన్ వన్ మ్యాన్ షో అనే ముద్ర పడింది. కనీసం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎవరూ… నియోజకవర్గం స్థాయి నేతను కూడా వేదికపైకి పిలవరా అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు, వైఎస్ షర్మిలా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, లోకేశ్ పాదయాత్ర చేసే సమయంలో ప్రసంగించారు. ఆ సమయంలో వేదిక నిండా నేతలే ఉన్నారు. కానీ పవన్ విషయంలో మాత్రం… ఒంటరిగా కనిపిస్తున్నారు. అసలు జనసేనలో పవన్, మనోహర్ తర్వాత ఎవరున్నారనే విషయం కూడా తమకు తెలియదంటున్నారు పార్టీ కార్యకర్తలు.