పవన్ వారాహి పార్ట్-2..వెస్ట్‌పై ఫోకస్.!

జనసేన అధినేత పవన్ కల్యాణ్..వారాహి యాత్ర రెండో విడత మొదలుపెట్టనున్నారు. ఏలూరు నుంచి రెండో విడత ప్రారంభం కానుంది. అయితే వారాహి యాత్ర చేసే విషయంలో పవన్ చాలా వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నట్లు కనిపిస్తున్నారు. జనసేనకు ఏ ఏ స్థానాల్లో బాగా పట్టు ఉంటుందని అనుకుంటున్నారో ఆ స్థానాల్లోనే యాత్ర చేస్తున్నారు. మొదట విడతలో పవన్ అదే చేశారు.

అయితే మొదట విడతలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాపై ఫోకస్ పెట్టి ముందుకెళ్లారు. అక్కడ జనసేనకు పట్టున్న స్థానాల్లోనే ఆయన తిరిగారు. ఆ తర్వాత వెస్ట్ గోదావరికి వచ్చి నరసాపురం, భీమవరంలోనే యాత్ర చేశారు. ఇక ఇప్పుడు వెస్ట్ లోని కొన్ని స్థానాల్లో యాత్ర మొదలుపెడుతున్నారు. మొదట ఏలూరు నుంచి యాత్ర మొదలుకానుంది. ఏలూరులో 9న వారాహి యాత్ర మొదలవుతుంది. అదే రోజు సభ జరగనుంది. నెక్స్ట్ దెందులూరు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, తణుకు స్థానాలపై కూడా పవన్ ఫోకస్ పెడతారు.

ఇక మొదట విడత ఎలాగో భారీ సక్సెస్ అయింది. పెద్ద ఎత్తున ప్రజా స్పందన వచ్చింది. దీంతో రెండో విడత యాత్రపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇది కూడా భారీగా సక్సెస్ అవుతుందని తెలుస్తుంది. అయితే టి‌డి‌పితో పొత్తులో భాగంగా తమకు ఏ సీట్లు దక్కుతాయని అనుకుంటారో..ఆ స్థానాల్లోనే పవన్ యాత్ర కొనసాగుతున్నట్లు తెలుస్తుంది.

ఇప్పుడు ఏలూరులో వారాహి యాత్ర కొనసాగనుంది. దీంతో ఈ సీటుపై పవన్ ఫోకస్ పెట్టారు. పొత్తులో భాగంగా ఈ సీటు జనసేన తీసుకునే అవకాశాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో జనసేన ఓట్లు చీల్చడం వల్లే ఇక్కడ వైసీపీ నుంచి ఆళ్ళ నాని గెలిచారు. ఇప్పుడు టి‌డి‌పి-జనసేన కలిస్తే వైసీపీ గెలుపు కష్టమే.