తిరుపతికి పవన్..సీఐ అంజుపై చర్యలు?

శ్రీకాళహస్తి సీఐ అంజు యాదవ్ ఎక్కువ వివాదాల్లో చిక్కుకుంటున్న విషయం తెలిసిందే. ఆమె అధికార వైసీపీకి అండగా ఉంటూ..ప్రతిపక్షాలు ఏమైనా నిరసనలు తెలియజేస్తే వారిని అణిచివేసే కార్యక్రమాలు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఆ మధ్య నిరసన తెలియజేస్తున్న టి‌డి‌పి కార్యకర్త పట్ల దురుసుగా ప్రవర్తించినట్లు విమర్శలు వచ్చాయి. అలాగే  హోటల్ సమయానికి మూయలేదంటూ శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్ ఓ మహిళపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ అయింది.

ఇక తాజాగా వైసీపీ తీరుకు నిరసన తెలియజేస్తున్న జనసేన కార్యకర్తల పట్ల కూడా ఆమె దురుసుగా ప్రవర్తించారు. ఓ జనసేన కార్యకర్త రెండు చెంపలు వాయించారు. ఇక అంజూయాదవ్ బహిరంగంగా రెండు చెంపల మీద కొట్టటం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సీఐ వ్యవహార శైలిని నిరసిస్తూ పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. రాష్ట్ర మానవ హక్కుల సంఘం ఈ ఘనట పైన ఆగ్రహం వ్యక్తం చేసింది. దీని పైన తీసుకున్న చర్చల వివరాలను ఈ నెల 27 లోగా ఇవ్వాలని ఆదేశించింది.

ఇక ఈ ఘటనపై పవన్ సీరియస్ అయ్యారు. జనసేన నేతలు..కార్యకర్తల పై చేయి పడితే తన పైన పడినట్లేనని చెప్పుకొచ్చారు. శ్రీకాళహస్తిలో తన పార్టీ నేతలు శాంతియుతంగా నిరసన చేస్తుంటే ఎందుకు కొట్టారని నిలదీసారు. దీని పైన తానే తిరుపతికి వెళ్లి ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు. ఈ నెల 17న ఆయన తిరుపతికి వెళుతున్నారు. అయితే వరుస ఘటనలపై పోలీసు ఉన్నతాధికారులు అంజు యాదవ్ పై సీరియస్ గా ఉన్నారని తెలిసింది. ఆమెపై చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని కథనాలు వస్తున్నాయి. చూడాలి మరి పవన్..తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేశాక..సీఐపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో.