రోజుకో నియోజకవర్గం.. ఇది ఎలా సాధ్యం….!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది. వాస్తవానికి నెల్లూరు జిల్లా చేరే వరకు పరిస్థితి ఒకలా ఉన్న పాదయాత్ర… ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించిన తర్వాత మరోలా మారిపోయిందనే మాట వినిపిస్తోంది. పాదయాత్ర కోసం టీడీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. ఇప్పటి వరకు జరిగిన యాత్రకు భిన్నంగా… భారీ ఫ్లెక్సీలు, కటౌట్‌లతో తమ సత్తా ఏమిటో చూపిస్తున్నారు. అయితే జిల్లాలో కొనసాగుతున్న లోకేశ్ పాదయాత్రపై వైసీపీ నేతలు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తోంది. గతంలో ఒక్కో నియోజకవర్గంలో కనీసం 3 రోజుల పాటు పాదయాత్ర చేసిన లోకేశ్… ప్రకాశం జిల్లాలో మాత్రం రోజుకో నియోజకవర్గం ఎలా పూర్తి చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. మరి కొందరైతే.. ఆయనేమైనా ఉస్సేన్ బోల్టా… వేగంగా పరిగెత్తి రోజుకో నియోజకవర్గం పూర్తి చేయడానికి అని వ్యంగ్యాస్థ్రాలు వేస్తున్నారు.

4 రోజుల్లో నాలుగు నియోజకవర్గాల్లో పాదయాత్ర జరిగిన విషయాన్ని వైసీపీ అభిమానులు ప్రస్తావిస్తున్నారు. 157వ రోజు కొండెపి, 158వ రోజు కనిగిరి, 160వ రోజు మార్కాపురం, 162 సంతనూతలపాడు, 165వ రోజు ఒంగోలులో పాదయాత్ర చేస్తున్నారు లోకేశ్. రోజుకు కేవలం 10 నుంచి 12 కిలోమీటర్లు మాత్రమే నడుస్తున్న లోకేశ్… నియోజకవర్గం ఎలా దాటేస్తున్నారనేది వైసీపీ అభిమానుల అనుమానం. రాత్రికి రాత్రి కారెక్కి పక్క నియోజకవర్గంలోకి వెళ్తున్నారా అని కూడా సెటైర్లు వేస్తున్నారు. లోకేశ్ పాదయాత్రపై వైసీపీ అభిమానులు చేస్తున్న వ్యాఖ్యలకు టీడీపీ నేతలు ఘాటుగానే బదులిస్తున్నారు. నైసర్గికంగా కనీస అవగాహన లేదా అని నిలదీస్తున్నారు. కొండెపి నుంచి కనిగిరి చేరుకున్న పాదయాత్ర… నేరుగా పొదిలి చేరుకుంది. అక్కడ నుంచి మర్రిచెట్లపాలెం మీదుగా చీమకుర్తి, సంతనూతలపాడు మీదుగా ఒంగోలు చేరుకుంది పాదయాత్ర. వాస్తవానికి కనిగిరి ఒంగోలు మధ్య దూరం కేవలం 66 కిలోమీటర్లు మాత్రమే. ఈ మధ్యలోనే నాలుగు నియోజకవర్గాలున్నాయి. కనిగిరి తర్వాత పొదిలి సమీపంలో మార్కాపురం నియోజకవర్గం సరిహద్దు మొదలవుతుంది. ఆ తర్వాత 20 కిలోమీటర్ల దూరంలోనే మర్రిచెట్లపాలెం నుంచి సంతనూతలపాడు నియోజకవవర్గం మొదలు. అక్కడ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో పేర్నమిట్ట వద్ద ఒంగోలు నియోజకవర్గం. దీంతో ఒక్కో నియోజకవర్గంలో రెండు రోజులు నడిస్తే చాలు… నియోజకవర్గం మారిపోతుంది. ఇది కూడా మీకు తెలియదా అని నిలదీస్తున్నారు. గ్రామాల్లో కాకుండా రహదారిపైనే యాత్ర చేయడంతో 2 రోజుల్లోనే ఒక్కో నియోజకవర్గం పూర్తి చేస్తున్నారనేది టీడీపీ నేతల మాట.