శ్రీకాకుళం జిల్లా టీడీపీలో ఆధిపత్య పోరు…!

రాజకీయ చైతన్యం ఉన్న జిల్లాలో శ్రీకాకుళం ఒకటి. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్న వారిలో దాదాపు అందరూ సీనియర్లే. కిమిడి కళా వెంకట్రావు, కావలి ప్రతిభా భారతి, గుండ అప్పల సూర్యనారాయణ, కోండ్రు మురళీమోహన్, గౌతు శ్యామ్ సుందర్ శివాజీ, ధర్మాన సోదరులు, తమ్మినేని సీతారాం, కూన రవికుమార్, కింజరాపు అచ్చెన్నాయుడులు రాష్ట్రస్థాయి పదవులు అనుభవించిన వారే. వీరిలో ప్రతిభా భారతి స్పీకర్, కూన రవి కుమార్ ప్రభుత్వ విప్‌గా కొనసాగారు. మిగిలిన వారంతా మంత్రి పదవులు అనుభవించిన వారే. వీరిలో ధర్మాన సోదరులు మినహా… మిగిలిన వారంతా పసుపు జెండా కప్పుకున్న వారే. అంతటి రాజకీయ చైతన్యం కలిగిన జిల్లాలో ఇప్పుడు తెలుగు తమ్ముళ్ల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. చాలా నియోజకవర్గాల్లో సీనియర్ – జూనియర్ వార్ నడుస్తోంది. కొన్ని చోట్ల అయితే… పార్టీలోని నేతలే కొత్త వారిని ఎంకరేజ్ చేస్తున్నారనే పుకార్లు కూడా షికారు చేస్తున్నాయి.

ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు రెడీ అవుతున్న కిమిడి కళా వెంకట్రావుకు సొంత పార్టీకి చెందిన కలిశెట్టి అప్పలనాయుడు నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. గత ఎన్నికల్లో కూడా సీటు ఆశించి భంగపడిన కలిశెట్టి… ఈ సారి మాత్రం ఎలాగైనా సాధించాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇక శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి పోటీకి రెడీ అవుతున్న గుండ లక్ష్మీదేవికి గొండు శంకర్ రూపంలో అసమ్మతి ఎదురవుతోంది. ఉత్తరాంధ్రలో బలమైన సామాజిక వర్గానికి చెందిన నేతగా గుర్తింపు తెచ్చుకున్న గోండు శంకర్ కూడా టీడీపీ టికెట్ కోసం బలంగానే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక రాజాం నియోజకవర్గం నుంచి కోండ్రు మురళీమోహన్, కావలి గ్రీష్మ మధ్య ఆదిపత్య పోరు నడుస్తోంది. వీరిద్దరూ టికెట్ తమకంటే.. తమదే అని బలంగా ప్రచారం చేస్తున్నారు. పాతపట్నం నియోజకవర్గంలో కూడా మాజీ ఎమ్మెల్యే కలమట వెంకట రమణకు మామిడి గోవిందరావు ఢీ అంటున్నాడు. తాజాగా తన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించిన మామిడి గోవిందరావు… పార్టీ అగ్రనేతలతో నిత్యం టచ్‌లో ఉన్నారనే మాట కూడా వినిపిస్తోంది.

అయితే పార్టీలో అసమ్మతి వెనుక ఓ కీలక నేత హస్తం ఉందనే మాట బలంగా వినిపిస్తోంది. జిల్లాలో సీనియర్లను పక్కన పెట్టి… తన వర్గం నేతలను పెంచుకోవాలనేది ఆ నేత ప్లాన్‌ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న నేతలంతా తనకంటే సీనియర్లు కావడంతో… వారి మాటే ఎక్కువగా చెల్లుతుందని.. ముఖ్యనేత ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. అందుకే ఎన్నికల్లో సీనియర్లను పక్కకు నెట్టి… తన వర్గం నేతలను తెరపైకి తీసుకువస్తే… పార్టీతో పాటు జిల్లా మొత్తం తన కంట్రోల్‌లో ఉంటుందనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో రాబోయే ఎన్నికల్లో టికెట్ ఎవరికీ వస్తుందో అనే ప్రచారం ఇప్పుడు జిల్లాలో, పార్టీలో జోరుగా నడుస్తోంది. ఇదే సమయంలో తమను అడ్డుకుంటున్న నేతపై పార్టీ అధినేతకు ఫిర్యాదు చేసేందుకు కూడా సీనియర్లు వెనకాడటం లేదు.