కృష్ణా వైసీపీలో కొత్త అభ్యర్ధులు రెడీ..ఆ సీట్లలో చేంజ్.!

రానున్న ఎన్నికల్లో మరొకసారి గెలుపు గుర్రాలని పెట్టుకుని విజయం సాధించాలని జగన్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో గెలిచిన అందరు ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వడం అనేది కష్టం. ఎందుకంటే ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకత ఎదురుకుంటున్నారని తెలుస్తుంది. అలాంటి వారికి సీట్లు ఇవ్వనని జగన్ చెప్పేస్తున్నారు. అలాగే కొంతమంది సీనియర్లు తప్పుకుని తమ వారసులని బరిలో దింపడానికి సిద్ధమవుతున్నారు.

ఈ సమీకరణాలని చూసుకుంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో కీలక మార్పులు జరిగేలా ఉన్నాయి. గత ఎన్నికల్లో జిల్లాలో 16 సీట్లు ఉంటే వైసీపీ 14, టి‌డి‌పి 2 సీట్లు గెలుచుకుంది. ఇక టి‌డి‌పి నుంచి వల్లభనేని వంశీ వైసీపీలోకి వెళ్లారు. దీంతో వైసీపీకి 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి ఈ 15 మందికి సీట్లు ఇస్తారా?అంటే ఆ ఛాన్స్ లేదనే చెప్పాలి. ఇందులో కొందరిని పక్కన పెట్టేయడం ఖాయమని తెలుస్తుంది. ఇక ఈ సారి మార్పులు జరిగే నియోజకవర్గాల్లో మొదట మచిలీపట్నం ఉంది. ఇక్కడ ఎమ్మెల్యే పేర్ని నాని తప్పుకుని..తన వారసుడు కృష్ణమూర్తిని నిలబెడుతున్నారు.

అలాగే గన్నవరంలో గత ఎన్నికల్లో వైసీపీ నుంచి యార్లగడ్డ వెంకట్రావు పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు వల్లభనేని వంశీ పోటీ చేస్తున్నారు. విజయవాడ ఈస్ట్ లో బొప్పన భవకుమార్ పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు దేవినేని అవినాష్ బరిలో ఉంటారు. ఇక కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావుకు సొంత పార్టీ నుంచే వ్యతిరేకత ఉంది..ఆయన్ని మార్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

ఇటు పెడనలో మంత్రి జోగి రమేష్..మళ్ళీ తన సొంత సీటు మైలవరంలో పోటీ చేయాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. అక్కడ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఉన్నారు. మార్పు జరిగితే రెండుచోట్ల చేంజ్ రావచ్చు. ఇంకా ఒకరిద్దరు ఎమ్మెల్యేలకు సీటు డౌట్ అని తెలుస్తుంది. మొత్తానికి కృష్ణా వైసీపీలో గట్టిగానే మార్పు జరిగేలా ఉంది.