అద్దంకిలో గొట్టిపాటి దూకుడు..చైతన్య బ్రేక్ వేస్తారా?

రాష్ట్రంలో పార్టీ గాలితో సంబంధం లేకుండా గెలిచే నాయకుల్లో గొట్టిపాటి రవికుమార్ ఒకరని చెప్పవచ్చు. 2009 నుంచి ఆయన వరుసగా అద్దంకి నియోజకవర్గంలో సత్తా చాటుతున్నారు. 2009లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఆయన..2014లో వైసీపీలోకి వెళ్ళి గెలిచారు. అప్పుడు టి‌డి‌పి అధికారంలోకి వచ్చింది. తర్వాత టి‌డి‌పిలోకి వచ్చిన ఆయన..2019 ఎన్నికల్లో మళ్ళీ గెలిచారు. కానీ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చింది.

ఇలా పార్టీ బలంతో పాటు తన సొంత ఇమేజ్ తో గొట్టిపాటి గెలుస్తూ వస్తున్నారు. ఆయనకు నియోజకవర్గంలో ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. పైగా టి‌డి‌పి అధికారంలో ఉండగా అభివృద్ధి పనులు బాగానే చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటారు. ప్రజా  సమస్యలపై పోరాడుతూ ఉంటారు. అందుకే అద్దంకిలో గొట్టిపాటికి అంత పట్టు ఉంది. గొట్టిపాటికి చెక్ పెట్టడానికి వైసీపీ సైతం గట్టిగానే ట్రై చేస్తుంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక గొట్టిపాటిని గట్టిగానే టార్గెట్ చేశారు. ఒకానొక సమయంలో ఆయన పార్టీ మారిపోతారని ప్రచారం జరిగింది. కానీ ఆయన పార్టీ మారలేదు.

టి‌డి‌పిలోనే దూకుడుగా పనిచేస్తున్నారు. ఇప్పుడు లోకేష్ పాదయాత్ర నియోజకవర్గంలో ఎంట్రీ ఇచ్చింది. ఊహించని విధంగా పాదయాత్రని సక్సెస్ చేశారు. దాదాపు 50 వేల మంది పాదయాత్రలో ప్రత్యక్షంగా, పరోక్షంగా భాగస్వాములు అయ్యారు. దీంతో అద్దంకిలో గొట్టిపాటి బలం ఏంటో అర్ధం చేసుకోవచ్చు. అయితే గొట్టిపాటిపై ఇప్పటికే జగన్ అభ్యర్ధిని ప్రకటించారు.

బాచిన కృష్ణచైతన్యని అభ్యర్ధిగా ప్రకటించారు. ఆయన దూకుడుగా పనిచేస్తున్నారు. సీనియర్ నేత బాచిన గరటయ్య వారసుడుగా ఎంట్రీ ఇచ్చిన చైతన్య నియోజకవర్గంపై పట్టు సాధించే దిశగా వెళుతున్నారు. అటు అద్దంకిలో కరణం బలరామ్ వర్గాన్ని కూడా కలుపుకుని వెళుతున్నారు. ఈ సారి ఇక్కడ వైసీపీ జెండా ఎగరవేయాలని చూస్తున్నారు. చూడాలి మరి గొట్టిపాటికి చైతన్య చెక్ పెట్టగలరో లేదో.