వైసీపీలో ‘ఐ‌ఏ‌ఎస్’ పాలిటిక్స్..సీట్ల కోసం పోటీ?

రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చు.సినీ, వ్యాపారం..ఆఖరికి ప్రభుత్వ అధికారులు, ఐ‌ఏ‌ఎస్, ఐ‌పి‌ఎస్..ఇలా ఎవరికైనా రాజకీయాల్లో చోటు ఉంటుంది. ఇక కొంతమంది ప్రజా సేవ చేద్దామని వస్తారు..మరి కొందరు అధికారంతో అందలం ఎక్కాలని వస్తారు. ఇక ఎవరి ఉద్దేశం వారిది. అయితే ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ అధికారులుగా చేసే వారు కొందరు తమ ఉద్యోగాలని వదిలేసి రాజకీయాల్లోకి రావాలని చూస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో పలువురు అధికారులు అదే పనిలో ఉన్నారు.

ఇప్పుడు ఏపీలో కూడా అలాంటి సీన్ కనిపిస్తుంది. ఇప్పటికే రిటైర్డ్ ఐఏఎస్‌ విజయ్‌ కుమార్‌ వైసీపీ వైపు రావడానికి సిద్ధమయ్యారు. అయితే మొదట ఈయన పాదయాత్ర చేయడానికి సిద్ధమవుతున్నారు. తర్వాత వైసీపీలో సీటు దక్కించుకుని పోటీ చేయాలని చూస్తున్నారని తెలిసింది. తిరుపతి లేదా బాపట్ల ఎంపీ స్థానాలు..లేదా గూడూరు అసెంబ్లీ స్థానంలో పోటీ చేయాలని చూస్తున్నట్లు తెలిసింది. ఇదే క్రమంలో మరో ఐ‌ఏ‌ఎస్ అధికారి సైతం ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది.

ఇటీవలే దేవదాయ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పదవి దక్కించుకున్న నియర్‌ ఐఏఎస్‌ అధికారి… కరికాల వలవన్‌..తిరుపతి ఎంపీ సీటుపై ఫోకస్ చేసినట్లు సమాచారం. టీటీడీ బోర్డులో ఎక్స్‌ అఫిషియో సభ్యుడిగా ఆయన కొనసాగేలా ఈ పదవి దక్కించుకున్నారు. అయితే ఆగస్టు నెలాఖరుతో ఆయన రిటైర్‌ అవుతున్నారు. కానీ.. జగన్‌ సర్కారు ఆయన్ను ఏడాదిపాటు అదే పోస్టులో కొనసాగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంటే ఆయన ఇంకా ఎక్స్‌ అఫిషియో మెంబర్‌ హోదాలో టీటీడీలో కొనసాగుతూ, తిరుపతిలో రాజకీయం నడిపించవచ్చు. తమిళనాడుకు చెందిన ఈ అధికారి…తమిళనాడు, ఏపీకి సరిహద్దుగా ఉన్న తిరుపతిలో పోటీ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. మరి జగన్ ఏ అధికారికి ఛాన్స్ ఇస్తారో చూడాలి.