దొంగ ఓట్ల కలకలం..పిల్లలకు కూడా ఓట్లు..!

ఏపీలో దొంగ ఓట్ల కలకలం రేగుతుంది. ప్రతి నియోజకవర్గంలో దాదాపు 10 వేల వరకు దొంగ ఓట్లు నమోదు అవుతున్నాయని పెద్ద ఎత్తున కథనాలు రావడం సంచలనంగా మారింది. అది కూడా అధికార వైసీపీనే ఈ దొంగ ఓట్ల సృష్టికర్త అని ఆరోపణలు వస్తున్నాయి. అధికారంలో ఉన్న వైసీపీ..అధికార దుర్వినియోగంకు పాల్పడుతూ..వాలంటీర్లని ఉపయోగించుకుని దొంగ ఓట్లు సృష్టించడం..అలాగే టి‌డి‌పి సానుభూతి పరుల ఓట్లని తొలగించడం చేస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి.

తాజాగా టి‌డి‌పి కంచుకోట అయిన కొండపి నియోజకవర్గంలో భారీగా దొంగ ఓట్లు నమోదయ్యాయని కథనాలు వచ్చాయి. ఒకే డోర్ నెంబర్ పై పదుల సంఖ్యలో ఓట్లు నమోదు అయ్యాయట. అది కూడా డోర్ నెంబర్లు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..0-0, 0-00, 00, 0-000 ఇలా డోర్ నెంబర్లు ఉండగా, వాటిపై ఓట్లు నమోదు అయ్యి ఉన్నాయట. అసలు అవి డోర్ నెంబర్లే కాదు..కానీ డోర్ నెంబర్లు పెట్టి ఓట్లు ఉన్నాయి..ఎవరైనా ఓటర్లు చనిపోయిన, శాశ్వతంగా వలస వెళ్ళిపోయినా…వారి ప్లేస్ లో కొత్తగా ఓట్లు నమోదు అవుతున్నాయి.

ఇదే సమయంలో టి‌డి‌పి సానుభూతి పరుల ఓట్లు తొలగించడం, లేదా వారిని ఒక బూత్ నుంచి మరొక బూత్‌కు మార్చడం చేస్తున్నారట. ఇలా వైసీపీ అన్నీ రకాలుగా అధికారాన్ని వాడుకుని అడ్డుగోలుగా ఓటర్ల లిస్టులో అక్రమాలకు పాల్పడుతుందని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ప్రతిపక్ష టి‌డి‌పి సైతం పెద్ద ఎత్తున పోరాడుతూనే ఉంది.

ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలో ఓ వైసీపీ నాయకుడు..15-18 లోపు ఉన్న పిల్లల వివరాలు సేకరించి…వారి ఆధార్ కార్డు, కుటుంబానికి సంబంధించిన  రేషన్‌ కార్డు, రెండు ఫొటోలు తీసుకోవాలని వాలంటీర్లని ఆదేశించారట. అంటే ఓటరుగా నమోదు చేసుకోవాలంటే 18 ఏళ్ళు నిండాలి..కానీ 15-18 ఏళ్ల వారిని సైతం ఓటరు లిస్టులో చేరుస్తున్నట్లు తెలిసింది. ఇలా అన్నీ రకాలుగా అక్రమాలకు పాల్పడి దొంగ ఓట్లు వేయించి మళ్ళీ గెలవాలని వైసీపీ చూస్తుందని ఆరోపణలు వస్తున్నాయి.