ఉమాకు మళ్ళీ ఎదురుదెబ్బ..సొంత వాళ్ళే.!

ఒకప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో దేవినేని ఉమా తిరుగులేని నాయకుడుగా ఉండేవారు. కృష్ణా టి‌డిపిలో ఈయన హవా ఎక్కువ ఉండేది. ఇక ఈయన ఏది చెబితే అదే అన్నట్లు నడిచేది. అలా ఉమా హవా నడిచేది..అలాంటిది ఇప్పుడు ఆయన పరిస్తితి దారుణంగా తయారైంది. చిన్న నాయకుడు కూడా ఆయన్ని లెక్క చేయడం లేదు. ఇక టి‌డి‌పి అధిష్టానం వద్ద ఆయన మాట చెల్లుబాటు కావడం లేదు. ఒక్క ఓటమి ఆయన్ని పాతాళానికి తీసుకెళ్లింది.

వరుసగా నాలుగుసార్లు ఉమా సత్తా చాటారు. 1999,2004లో నందిగామ నుంచి, 2009, 2014లో మైలవరం నుంచి గెలిచారు. ఊహించని విధంగా 2019లో తొలిసారి ఓటమి పాలయ్యారు. అది కూడా తన చిరకాల ప్రత్యర్ధి వసంత కృష్ణప్రసాద్ చేతిలో ఓడిపోయారు. ఆ ఓటమి ఒక్కసారిగా దేవినేనిని తోక్కేసింది. ఇక జిల్లాలో ఆయన పెత్తనం ఆగిపోయింది. ఇప్పటికే ఆయన పెత్తనంతో జిల్లాలో కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి వారు టి‌డి‌పిని వదిలి వైసీపీకి వెళ్లారనే టాక్ ఉంది.

ఇక ఇప్పుడు టి‌డి‌పిలో సైతం ఉమాకు యాంటీగా పనిచేసేవారు ఎక్కువే ఉన్నారు. అలాగే మైలవరంలోనే ఉమాకు చెక్ పెట్టేలా టి‌డి‌పి నేత బొమ్మసాని సుబ్బారావు పనిచేస్తున్నారు. స్థానికులకే సీటు ఇవ్వాలనే డిమాండ్ చేస్తున్నారు. ఈయనకు ఎంపీ కేశినేని నాని సపోర్ట్ చేస్తున్నారు. అలాగే వైసీపీ ఎమ్మెల్యే వసంతతో కేశినేని సఖ్యతగానే ఉంటారు. ఈ అంశాలు ఉమాకు పెద్ద మైనస్ అవుతున్నాయి.

ఒకవేళ వైసీపీపై వ్యతిరేకత ఉన్నా సరే..దేవినేనికి సొంత పార్టీ వాళ్ళే చెక్ పెట్టేలా ఉన్నారు. ఇప్పటికీ అక్కడ ఉమాకు గెలుపు అవకాశాలు మెరుగు పడలేదు. ఈ సారి ఎన్నికల్లో కూడా ఉమాకు ఎదురుదెబ్బ తగిలేలా ఉంది.