కేంద్రం ఉపశమనం కలిగించినా.. మల్లీప్లెక్స్‌లలో తగ్గని పాప్ కార్న్, కూల్‌డ్రింక్స్ ధరలు

సినిమా థియేటర్లలో ఆహార పదార్థాల ధరలు బాగా ఎక్కువ ధరకు విక్రయిస్తూ ఉంటారు. బయట కంటే చాలా ఎక్కువ ధరలకు అమ్ముతారు. దీంతో అంత రేటు పెట్టి ఎక్కువమంది థియేటర్లలో ఫుడ్‌ను కొనుగోలు చేయలేరు. మధ్యతరగతి ప్రజలైతే అసలు వాటి ధరలను చూసే నోరెళ్లబెడతారు. సినిమా థియేటర్లకు సామాన్య, మధ్యతరగతి ప్రజలు వెళ్లకపోవడానికి కారణం ఇదేననే వాదనలు కూడా ఉన్నాయి. ఇప్పటికే సినిమా టికెట్ల రేట్లు కరోనా తర్వాత ఆమాంతంగా పెంచేశారు. రూ.200కిపైగానే టికెట్ ధర ఉంది.

ఇక కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి వెళ్లినప్పుడు సినిమా ఇంటర్వెల్ సమయంలో ఏవొక స్నాక్స్ తినాలనిపిస్తుంది. పెద్ద పెద్ద మల్టీప్లెక్స్ లలలో వాటి ధరలు బాగా ఎక్కువగా ఉంటాయి. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం మల్టీప్లెక్స్‌లలోని ఆహార పదార్థాలపై జీఎస్టీని తగ్గించింది, 18 శాతం ఉన్న జీఎస్టీని 5 శాతం తగ్గించింది. దీంతో మల్టీప్లెక్స్ లలో అమ్మే ఆహార పదార్థాల రేట్లు తగ్గనున్నాయి. కొంతమంది రేట్లు తగ్గించి విక్రయిస్తుండగా.. మరికొంతమంది రేటు తగ్గించుకుండా అమ్ముతున్నారు.

మొన్నటివరకు పాప్ కార్న్ రూ.200 ఉంటే 18 శాతం జీఎస్టీ కలిపి రూ.240కి అమ్మేవారు. అయితే ఇప్పుడు జీఎస్టీ తగ్గించిన తర్వాత పాప్ కార్న్ అసలు ధర రూ.230గా చూపించి జీస్టీ రూ.10 కలిపి ఇంతకుముందు అమ్మే రూ.240కే విక్రయిస్తున్నారు. అలాగే కూల్ డ్రింక్స్ రేట్లను కూడా పాత ధరలకే విక్రయిస్తున్నారు. దీంతో సినిమా ప్రేక్షకులు మండిపడుతున్నారు. కేంద్రం జీఎస్టీ తగ్గించినా మల్టీప్లెక్స్ యజమానులు పుడ్ ధరలను తగ్గించలేదని మండిపడుతున్నారు. వీరిపై జీఎస్టీ అధికారులు చర్యలు తీసుకోవాలని మండిపడుతున్నారు. ఇటీవల ఓ మల్టీప్లెక్స్ లో పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ కి కలిపి రూ.800 బిల్లు వేశారు. దీనికి ఓ వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.