కమలంలో ఈటల పోటు..సైడ్ చేస్తారా?

ఇంతకాలం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలోనే అంతర్గత పోరు ఉంది..ఆ పార్టీలో నేతలు బహిరంగంగానే నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటారు. కానీ ఇటీవల వారు పోరు పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేయడం మొదలుపెట్టారు. అయితే అనూహ్యంగా బి‌జే‌పిలో రచ్చ మొదలైంది. ఆ పార్టీలో సీనియర్ నేతల మధ్య అంతర్గత పోరు నడుస్తుంది. దీని వల్ల పార్టీకి నష్టం జరిగేలా ఉంది.

కొన్ని విజయాలతో తెలంగాణలో బి‌జే‌పి రేసులోకి వచ్చింది. ఒకానొక సమయంలో బి‌ఆర్‌ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బి‌జే‌పి అనే పరిస్తితి. కానీ ఇప్పుడు సీన్ మారింది. బి‌ఆర్‌ఎస్ , కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రధాన పోరు జరుగుతుంది. దీంతో బి‌జే‌పి వెనుకబడింది. పైగా ఆ పార్టీలో విభేదాలు చాలా నష్టం చేసేలా ఉన్నాయి. అక్కడ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్‌లకు పెద్దగా పొసగడం లేదనే సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య అంతర్గత విభేదాలు తారస్థాయిలో నడుస్తున్నాయి.

ముఖ్యంగా చేరికల విషయంలో ఈటల సొంతంగా ముందుకెళుతున్నారు. ఆ నిర్ణయాలు బండికి కూడా తెలియడం లేదు. అటు బండి సైతం తన బాటలో తాను వెళుతున్నారు. అలాగే ఇరువురు నేతల వర్గాలు సెపరేట్ గా ఉన్నాయి. అదే సమయంలో తాజాగా ఢిల్లీకి వెళ్ళిన ఈటల..అక్కడ నుంచి కావాలని కొన్ని లీకులు ఇచ్చారని బండి వర్గం ఫైర్ అవుతుంది.

అధ్యక్షుడుగా బండిని మార్చి డీకే అరుణని పెడుతున్నారని, అలాగే తనకు ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్ పదవి ఇస్తున్నారని కథనాలు వచ్చాయి. ఇవన్నీ ఈటల వర్గం సృష్టించిన కథనాలు అని ప్రచారం జరుగుతుంది. వీటిపై కొందరు సీనియర్లు కూడా గుర్రుగా ఉన్నారు. ఈటలకు వ్యతిరేకంగా కొందరు సీనియర్ నేతలు పావులు కదుపుతున్నారు. ఇలా బి‌జే‌పిలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు పరిస్తితి ఉంది.