మిషన్ రాయలసీమ..వైసీపీ టార్గెట్‌తో లోకేష్.!

గత వంద రోజుల పై నుంచి రాయలసీమ జిల్లాల్లో లోకేష్ పాదయాత్ర జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే మొదట లోకేష్ పాదయాత్రపై ప్రజలకు పెద్ద అంచనాలు లేవు. అలాగే అనుకున్న విధంగా కూడా ప్రజల నుంచి స్పందన రాలేదు. కానీ నిదానంగా లోకేష్ ప్రజల్లోకి వెళుతున్న తీరు, సమస్యలపై స్పందిస్తున్న తీరు, ప్రజా సమస్యలపై గళం విప్పుతున్న తీరు అందరినీ ఆకట్టుకుంది. దీంతో లోకేష్ పాదయాత్రకు ప్రజా మద్ధతు పెరిగింది.

ఉమ్మడి చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పాదయాత్ర ముగించుకుని జగన్ కంచుకోట కడపలోకి లోకేష్ పాదయాత్ర ఎంట్రీ ఇచ్చింది. ఇక కడపలో లోకేష్ పాదయాత్రకు పెద్ద స్పందన రాదని అంతా అనుకున్నారు. కానీ అక్కడే పెద్ద ట్విస్ట్ ఉంది. ఊహించని స్థాయిలో ప్రజలు వస్తున్నారు. ఆయన రోడ్ షోలు ఖాళీ ఉండటం లేదు. దీంతో కడపలో కూడా టి‌డి‌పికి కొత్త ఉత్సాహం వచ్చింది. అదే సమయంలో ఈ సారి రాయలసీమలో పెద్ద ఎత్తున సీట్లు గెలవడమే లక్ష్యంగా లోకేష్ ప్లాన్ చేస్తున్నారు. ఇదే క్రమంలో మిషన్ రాయలసీమ అంటూ కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు.

మిషన్‌ రాయలసీమతో ఈ ప్రాంత రూపురేఖలే మార్చేస్తామని, సీమలో అపారమైన వనరులు ఉన్నాయని.. పెద్దఎత్తున పరిశ్రమలను తీసుకొచ్చి.. స్థానికంగానే యువతకు ఉపాధి కల్పిస్తామని తెలిపారు. హార్టీకల్చర్‌ హబ్‌గా మార్చి ప్రపంచానికి అవసరమైన పండ్లను ఎగుమతి చేస్తామని,  టీడీపీ అధికారంలోకి వచ్చాక రాయలసీమలో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలన్నీ రూపుమాపుతామని హామీ ఇచ్చారు.

అదే సమయంలో గత ఎన్నికల్లో వైసీపీకి సీమ నుంచి 49 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు. ఇంత మంది ఎమ్మెల్యేలను గెలిపించినందుకు ఎంత అభివృద్ధి చేయాలి? ఒక్క పరిశ్రమ తెచ్చారా? ఒక్క ప్రాజెక్టు పూర్తి చేశారా? వచ్చే ఎన్నికల్లో 49 మంది టీడీపీ ఎమ్మెల్యేలను గెలిపించండి, అభివృద్ధి అంటే చూపిస్తా…చేయకపోతే కాలరు పట్టుకుని నిలదీయండని చెప్పుకొచ్చారు.

అయితే గత ఎన్నికల్లో సీమలో 52 సీట్లలో వైసీపీకి 49, టి‌డి‌పికి 3 సీట్లే వచ్చాయి. ఇప్పుడు వైసీపీకి ఇచ్చిన సీట్లే ఇప్పుడు  టి‌డి‌పికి ఇవ్వమంటున్నారు. అన్నీ సీట్లు కష్టం గాని..సగం సీట్లు గెలిచిన సీమలో టి‌డి‌పి సక్సెస్ అయినట్లే.