హలో ఏపీ..బై బై వైసీపీ..పవన్ నినాదం వర్కౌట్ అవుతుందా?

జనసేన అధినేత పవన్ గత కొన్ని రోజులుగా వారాహి యాత్ర చేస్తూ..ప్రజల్లో ఉంటున్న విషయం తెలిసిందే. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పవన్ యాత్ర కొనసాగుతుంది. పెద్ద ఎత్తున పవన్ యాత్రకు ప్రజా స్పందన వస్తుంది. ఇక జగన్ ప్రభుత్వంపై, వైసీపీ ఎమ్మెల్యేలపై పవన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. వైసీపీ నేతలు ఏపీని అరాచకాలకు కేరాఫ్ అడ్రెస్ గా మార్చారని ఫైర్ అవుతున్నారు. తక్షణమే జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని అంటున్నారు.

అలాగే తనకు సి‌ఎం గా అవకాశం ఇవ్వాలని, జనసేన ప్రభుత్వం వస్తే ఏపీని నెంబర్ 1 గా తీర్చిదిద్దుతానని అంటున్నారు. ఇదే క్రమంలో తాజాగా అమలాపురం సభలో పవన్ కొత్త స్లోగన్ అందుకున్నారు. హలో ఏపీ…బై బై వైసీపీ అని నినాదం ఇచ్చారు. జనం బాగుండాలంటే..జగన్ పోవాలని నినదించారు. ఇక జగన్ ప్రభుత్వంలో గంజాయి పెరిగిందని, కల్తీ మద్యం వచ్చిందని, ఇందులో వైసీపీ నేతలు వేల కోట్లు దోచుకుంటున్నారని ఫైర్ అయ్యారు.

 

ఇలా పవన్ ఇచ్చిన స్లోగన్‌ని జనసేన శ్రేణులు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నాయి. అయితే గతంలో వైసీపీ ఇలాగే..బై బై బాబు అంటూ స్లోగన్ ఇచ్చింది. ఇది బాగా వర్కౌట్ అయింది. 2019 ఎన్నికల్లో చంద్రబాబుని ప్రజలు ఓడించారు. ఇప్పుడు ఏమో పవన్ హలో ఏపీ..బై బై వైసీపీ అనే నినాదం అందుకున్నారు. ఇది ఎంతవరకు ప్రజల్లోకి వెళుతుందనేది చూడాలి.

అటు టి‌డి‌పి..సైకో పోవాలి..సైకిల్ రావాలి అంటూ నినాదం పెట్టుకుంది. దాని మీద ఒక పాట కూడా పెట్టేసింది. మరి ఈ నినాదాలని ప్రజలు పట్టించుకుని, జగన్‌ని గద్దె దించుతారా? లేదా రివర్స్ లో చంద్రబాబు, పవన్‌లకే షాక్ ఇస్తారా? అనేది చూడాలి.