కుప్పంలో లక్ష మెజారిటీ..బాబు లెక్కలు ఇవే.!

చంద్రబాబు కంచుకోట కుప్పంపై వైసీపీ ఎలా ఫోకస్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కుప్పం టార్గెట్ గా వైసీపీ రాజకీయం నడిపిస్తుంది. అధికార బలంతో కుప్పంలో పాగా వేయాలని ప్రయత్నిస్తుంది. మొదట పంచాయితీ ఎన్నికల్లో గెలిచింది. తర్వాత పరిషత్ ఎన్నికల్లో సత్తా చాటింది. ఆఖరికి కుప్పం మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. ఇంకా కుప్పం అసెంబ్లీనే కైవసం చేసుకుంటామని అంటుంది.

దీంతో చంద్రబాబు అలెర్ట్ అయ్యారు..మామూలుగా తన నామినేషన్ వేయడానికే ఆయన రారు..వేరే వాళ్ళకు నామినేషన్ పత్రాలు ఇచ్చి పంపిస్తారు. అలాంటిది వైసీపీ చేసే రాజకీయానికి బాబు అలెర్ట్ అయ్యారు. వీలు కుదిరినప్పుడల్లా కుప్పం రావడం మొదలుపెట్టారు. అక్కడే ఒక ఇల్లు కూడా కట్టుకుంటున్నారు. కానీ దానికి వైసీపీ ప్రభుత్వం పర్మిషన్ కూడా ఇవ్వట్లేదని అంటున్నారు. తాజాగా కుప్పం పర్యటనకు వచ్చి..టి‌డి‌పి శ్రేణులని కలిసి..అక్కడ ఎలా పనిచేయాలనే అంశంపై దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ సారి లక్ష మెజారిటీతో గెలవాలని అంటున్నారు.

ఆ దిశగా పనిచేయాలని టి‌డి‌పి కార్యకర్తలకు సూచిస్తున్నారు. ఈసారి ఎన్నికలకు తొమ్మిది నెలలు మాత్రమే గడువుతుందని చంద్రబాబు కార్యకర్తలకు గుర్తుచేశారు. పార్టీ పెట్టినప్పటి నుంచీ కుప్పం నియోజకవర్గంపై టీడీపీ జెండా ఎగురుతూనే ఉందని, ఇక్కడి ప్రజలు కూడా నీతి, నిజాయితీపరులని అన్నారు. అలాంటి నియోజవర్గం అభివృద్ధి కావాలన్నా, పిల్లల భవిష్యత్తు బాగుపడాలన్నా టీడీపీ రావాలని అన్నారు.

అయితే కుప్పంలో లక్ష మెజారిటీ అనేది చాలా కష్టమైన పని. ఇక్కడ బాబు అత్యధిక మెజారిటీ 65 వేలు..అది కూడా 1999 ఎన్నికల్లో వచ్చింది. గత ఎన్నికల్లో 30 వేల మెజారిటీ వచ్చింది. ఇప్పుడు వైసీపీ ఇంకా బలపడుతుంది. అలాంటప్పుడు లక్ష మెజారిటీ కష్టమే..గెలుస్తారేమో గాని..లక్ష మెజారిటీ కష్టమే.