వెంకటగిరి బరిలో నేదురుమల్లిని ఓడిస్తా? ఆనం మార్క్ పాలిటిక్స్.!

ఉమ్మడి నెల్లూరు జిల్లాపై మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి పట్టు ఎక్కువగానే ఉన్న సంగతి తెలిసిందే. గతంలో కాంగ్రెస్ లో మంత్రిగా చేసినప్పుడు ఈయనకు జిల్లా రాజకీయాలపై పట్టు ఉంది. గత ఎన్నికల్లో ఈయన వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచాక అనుకున్న మేర తన పట్టు కొనసాగించే అవకాశాలు రాలేదు. ఈ క్రమంలోనే ఆయన కొన్ని రోజుల క్రితమే వైసీపీ నుంచి బయటకొచ్చేశారు.

ఇక టి‌డి‌పిలో చేరడం ఖాయమైంది. ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లాలోకి వచ్చిన లోకేష్ పాదయాత్రకు మద్ధతుగా నిలుస్తూ వస్తున్నారు. అయితే జిల్లాపై పట్టున్న ఆనం..ముఖ్యంగా మూడు స్థానాలపై ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఆత్మకూరు, వెంకటగిరి, నెల్లూరు సిటీ..వీటిల్లో ప్రస్తుతం ఆయన వెంకటగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో టి‌డి‌పి నుంచి ఆత్మకూరులో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. అయినా సరే వెంకటగిరి, నెల్లూరు సిటీపై ఆయనకు పట్టు ఉంది. దీంతో ఆయా స్థానాల్లో వైసీపీని ఓడిస్తానని ఆనం అంటున్నారు. ఇప్పటికే నెల్లూరు సిటీలో అనిల్ కుమార్ యాదవ్‌ని ఓడిస్తామని ఛాలెంజ్ చేశారు.

తాజాగా ఇప్పుడు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరిలో వైసీపీ ఇంచార్జ్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి టార్గెట్ గా ఆనం ఫైర్ అవుతున్నారు. వెంకటగిరిలో వచ్చే ఎన్నికల్లో నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డిని ఫుట్‌బాల్‌ ఆడిస్తానని, ఈ దఫా ఫుట్‌బాల్‌ ఆడేవారిని తయారు చేస్తానని దాంతో ఆయనకు ఏమి జరుగుతుందో మాకైతే తెలియదని రామ్‌కుమార్‌రెడ్డిని పరోక్షంగా హెచ్చరించారు. ‘అక్కడ తంతాను ఇక్కడ తంతానంటే పడేవాళ్లు ఇక్కడ ఎవరూ లేరన్నారు.

అంటే వచ్చే ఎన్నికల్లో వెంకటగిరిలో పోటీ చేసే టి‌డి‌పి అభ్యర్ధికి ఆనం మద్ధతు ఇచ్చి..నేదురుమల్లిని ఓడిస్తానని అంటున్నారు. మరి ఆనం ప్రభావం ఎంతవరకు ఉంటుందో చూడాలి.