విశాఖ వైసీపీలో కుమ్ములాట..గుడివాడ వర్సెస్ దాడి!

ఏపీలో అధికార వైసీపీ అంతర్గత పోరు ఎక్కువ ఉన్న విషయం తెలిసిందే. చాలా నియోజకవర్గాల్లో నేతలకు పడటం లేదు. ఒకరిపై ఒకరు పై చేయి సాధించాలనే దిశగా పనిచేస్తూ..ఆధిపత్య పోరుకు దిగుతున్నారు. ఇదే క్రమంలో ఉమ్మడి విశాఖ జిల్లాలో కూడా ఆధిపత్య పోరు ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా మంత్రి అమర్నాథ్ ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లిలో రచ్చ ఎక్కువ గా ఉంది. అక్కడ ఇప్పటికే మంత్రికి నెగిటివ్ ఉంది.

ఇదే సమయంలో వైసీపీ సీనియర్ నేత దాడి వీరభద్రరావు..మంత్రికి పొసగడం లేదు. ఎప్పటినుంచో వారి మధ్య పోరు నడుస్తోంది. అయితే ఆ పోరు తాజాగా మరింత పెరిగింది. తాజాగా జగ్జీవన్‌రామ్‌ జయంతి సందర్భంగా మంత్రి అమర్నాథ్ అనకాపల్లి పట్టణంలో నెహ్రూచౌక్‌ నుంచి కాస్త దూరంలో ఉన్న రోడ్డు డివైడర్‌పై ఉన్న బాబూ జగ్జీవన్‌రామ్‌ విగ్రహానికి పూలమాలల వేసి నివాళులు అర్పించారు. అక్కడ దగ్గరలోనే మాజీ మంత్రి దాడి వీరభద్రరావుకు చెందిన డీవీఎన్‌ డిగ్రీ కళాశాల వుంది.

అయితే మంత్రి ప్రసంగిస్తున్న సమయంలో డీవీఎన్‌ కళాశాలలో నుంచి ‘జై జనసేన’ అంటూ ఓ విద్యార్థి నినాదం చేశాడు. దీంతో మంత్రి ప్రసంగం ఆపి.. అరిచిందో ఎవరో చూడాలని ఎస్‌ఐ దివాకర్‌ను ఆదేశించారు..వెంటనే కాలేజీలోకి దూసుకెళ్లిన ఎస్‌ఐ, వైసీపీ నాయకులు..విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఒకరి చొక్కా పట్టుకుని మెట్ల వరకు ఈడ్చుకొచ్చారు. దీనిపై ప్రిన్సిపాల్‌, సిబ్బంది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.  ఇక ఎస్‌ఐ దివాకర్‌ను సస్పెండ్‌ చేయాలని దాడి రత్నాకర్‌ డిమాండ్‌ చేశారు. అటు డీఎస్పీకి కళాశాల ప్రిన్సిపాల్‌ ఫిర్యాదు చేశారు. ఇలా దాడి-గుడివాడల మధ్య పోరు కాస్త కాలేజీ విద్యార్ధుల వరకు వెళ్లింది.

అటు పాయకరావుపేటలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే గొల్ల బాబూరావు వర్గీయులు, రాష్ట్ర కాపు కార్పొరేషన్‌ డైరెక్టర్‌ వీసం రామకృష్ణ వర్గీయులు తీవ్రస్థాయిలో ఘర్షణపడి పరస్పరం తోసుకున్నారు. ఇలా విశాఖ వైసీపీలో రచ్చ నడిచింది.