వెస్ట్‌లో ఆ సీట్లలో తమ్ముళ్ళ పోరు..బాబు సెట్ చేయరా?

వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేసే అభ్యర్ధులని చంద్రబాబు ఇప్పటినుంచే రెడీ చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో మాదిరిగా ఎన్నికల ముందు అభ్యర్ధులని ప్రకటించి ఇబ్బందులు పడకుండా..ఇప్పుడు ముందుగానే అభ్యర్ధులని ఫిక్స్ చేసి సత్తా చాటాలని చూస్తున్నారు. ఇప్పటికే పలు సీట్లలో అభ్యర్ధులు ఫిక్స్ అయ్యారు.

అయితే ఇంకా కొన్ని సీట్లలో అభ్యర్ధులు ఫిక్స్ కావాలి. ఇదే సమయంలో టి‌డి‌పికి బలం ఉన్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా వరకు అభ్యర్ధులు ఖరారు అయ్యారు. జనసేనతో పొత్తు ఉంటే ఆ పార్టీకి కొన్ని సీట్లు ఇవ్వాలి. జనసేనకు దక్కే సీట్లని వదిలిపెట్టి మిగిలిన సీట్లలో టి‌డి‌పి అభ్యర్ధులని ఫిక్స్ చేసుకుంటూ వచ్చారు. దాదాపు ఇక్కడ అభ్యర్ధులు రెడీ అయ్యారు. అయితే కొన్ని కీలక సీట్లలో అభ్యర్ధులని ఖరారు చేయాలి.

పోలవరం, చింతలపూడి, నిడదవోలు, ఏలూరు, కొవ్వూరు లాంటి చోట్ల అభ్యర్ధులు ఖరారు కాలేదు. దీంతో సీటు కోసం  నేతలు పోటీ పడుతున్నారు. పోలవరంలో ఇద్దరు నేతలు ఉన్నారు..మోడియం శ్రీనివాసరావు, బొరగం శ్రీనివాసరావు..ఈ ఇద్దరు సీటు కోసం పోటీ పడుతున్నారు. వీరిలో ఎవరికి సీటు ఇచ్చినా..మరొకరు అసంతృప్తి తప్పదు. అటు కొవ్వూరులో పోటీ చేయాలని మాజీ మంత్రి కే‌ఎస్ జవహార్ చూస్తున్నారు..కానీ అక్కడ ఆయనకు సీటు దక్కకుండా చేయాలని వేరే వర్గం చూస్తుంది. చింతలపూడి సీటు కోసం చాలామంది పోటీ పడుతున్నారు. కానీ బాబు ఇంతవరకు ఎవరికి సీటు ఇస్తారో తేల్చ లేదు.

ఇటు నిడదవోలు సీటు కోసం ఇద్దరు నేతలు పోటీపడుతున్నారు..బూరుగుపల్లి శేషారావు, కుందుల సత్యనారాయణ..ఈ ఇద్దరు సీటు ఆశిస్తున్నారు. బాబు ఎవరికి ఛాన్స్ ఇస్తారో చూడాలి. అటు ఏలూరు సీటు కోసం బడేటి చంటి ఎదురుచూస్తున్నారు. మరి ఆయనకు ఇస్తారా? లేక వేరే నేతకు ఇస్తారో క్లారిటీ లేదు. ఇక నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం లాంటి సీట్లలో టి‌డి‌పి నాయకులు ఉన్నారు గాని..ఆ సీట్లు పొత్తు ఉంటే జనసేనకు ఇచ్చే ఛాన్స్ ఉంది.