విశాఖ ’స్టీల్’ పాలిటిక్స్..ఎవరి ఎత్తు వారిదే.!

రాజకీయానికి కాదేదీ అనర్హం అన్నట్లుగా ఏపీలో ప్రతి అంశంపై రాజకీయం నడుస్తూనే ఉంది. ఇక ఇక్కడ ఉన్న పార్టీలు చాలనట్లు..పక్కన తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సైతం ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. జాతీయ పార్టీలో ఎదిగే క్రమంలో బి‌ఆర్‌ఎస్ ఏపీ వైపు ఫోకస్ పెట్టింది. అయితే ఇక్కడ రాజకీయంగా స్పేస్ లేదు..కానీ ఇప్పుడు ఆ స్పేస్ క్రియేట్ చేసుకునే పనిలో పడింది.

అది కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ తో ముందుకొస్తుంది. విశాఖ స్టీల్ ప్లాంట్‌ని ప్రైవేటీకరించడానికి కేంద్రం సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ అంశంపై అధికార వైసీపీ గాని, ఇటు టి‌డి‌పి, జనసేనలు గాని కేంద్రంపై పోరాడే ధైర్యం చేయడం లేదు. ఏదో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు మాత్రం పోరాటం చేస్తున్నారు. కానీ వారి పోరాటం ఫలితం ఇవ్వడం లేదు. ఇదే సమయంలో బి‌జే‌పిపై కేంద్ర స్థాయిలో పోరాటం చేస్తున్న కే‌సి‌ఆర్ ఎంట్రీ ఇచ్చి..ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా గళం విప్పారు.

 

అదే సమయంలో స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ లో కూడా పాల్గొనాలని తెలంగాణలోని సింగరేణి ద్వారా స్టీల్ ప్లాంట్ దక్కించుకోవాలని చూస్తున్నారనే చర్చ నడుస్తోంది. కానీ అసలు వాస్తవం వేరు. ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియకు, ప్రైవేటీకరణకు సంబంధం లేదు. ‘ముడిపదార్థాల సరఫరా లేదా వర్కింగ్‌ క్యాపిటల్‌ను సమకూర్చితే… దానికి సమానమైన విలువగల స్టీల్‌ ఇస్తాం! ఆసక్తి ఉన్న వాళ్లు ముందుకు రండి’ అని విశాఖ స్టీల్స్‌ ‘ఆసక్తి వ్యక్తీకరణ’ (ఈవోఐ) ప్రకటన జారీ చేసింది. అంతే గాని… ఇది స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకానికి కానే కాదు.

కానీ ఈ అంశంలో బి‌జే‌పికి చెక్, అలాగే ఏపీలో రాజకీయంగా బెనిఫిట్ అనేది కే‌సి‌ఆర్ ఆశిస్తున్నారనే చెప్పవచ్చు. ఇక కే‌సి‌ఆర్‌కు కౌంటరుగా జగన్ ప్రభుత్వం కూడా రాజకీయ పరంగా ముందుకెళుతుంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని, ఆ సంస్థను సంరక్షించుకోవాలన్నదే ముఖ్యమంత్రి జగన్ ఉద్దేశమని, అందుకే మోదీని కలిసినప్పుడల్లా జగన్మోహన్‌రెడ్డి పలు సలహాలు ఇస్తున్నారని సజ్జల చెప్పుకొచ్చారు.  అంటే ఇందులో ఎవరి పోలిటికల్ ఎజెండా వారికి ఉంది..కానీ చివరికి స్టీల్ ప్లాంట్ అంశాన్ని ఎటువైపు తిప్పుతారో చూడాలి.