నూజివీడుకు బాబు..తమ్ముళ్ళ మధ్య పోరు..సెట్ అవ్వరా!

ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్న విషయం తెలిసిందే.ఈ నెల 12 నుంచి ఆయన మూడు రోజుల పాటు జిల్లాలో పర్యటిస్తారు. 12న నూజివీడు, 13న గుడివాడ, 14న మచిలీపట్నంలో పర్యటిస్తారు. ఇక బాబు పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు, బహిరంగ సభ ఏర్పాట్లని టి‌డి‌పి నేతలు చూస్తున్నారు. ఇదే క్రమంలో 12న నూజివీడులో జరిగే సభ ఏర్పాట్లని టి‌డి‌పి నేతలు పర్యవేక్షిస్తున్నారు. ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, నూజివీడు టి‌డి‌పి ఇంచర్ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు చూసుకుంటున్నారు.

అయితే ఆ నేతలకు నూజివీడులోని స్థానిక నేతలు సహకరిస్తున్నట్లు కనిపించడం లేదు బాబు పర్యటనకు సంబంధించి గన్ని సమావేశం పెడితే..పలువురు నేతలు హాజరు కాలేదు. చాట్రాయి మండలానికి చెందిన పార్టీ మండల కార్యవర్గం మొత్తం సమావేశానికి గైర్హాజరైంది. టి‌డి‌పి కీలక నేత కాపా శ్రీనివాసరావు హాజరుకాలేదు. అయితే వీరు సెపరేట్ గా సమావేశం పెట్టుకున్నట్లు తెలిసింది.

నూజివీడు టి‌డి‌పిలో ఆధిపత్య పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. గన్నవరం నుంచి ముద్దరబోయినని తీసుకొచ్చి నూజివీడులో నిలబెట్టడంపై కొందరు నేతలు అసంతృప్తిగా ఉన్నారు. గత రెండు ఎన్నికల్లో కొందరు నేతలు ముద్దరబోయినకు సహకరించలేదు. దీంతో ముద్దరబోయిన ఓటమి పాలయ్యారు. ఇప్పటికీ అక్కడ ముద్దరబోయినకు వ్యతిరేక వర్గం ఉంది.

అలాగే కీలక కమ్మ నేతలు నూజివీడు సీటు కోసం ట్రై చేస్తున్నారు. దీంతో ముద్దరబోయినని సైడ్ చేయాలని చూస్తున్నారు. ఇలా నూజివీడు టి‌డి‌పిలో రచ్చ నడుస్తోంది. దీని వల్ల బాబు పర్యటనపై కూడా ఎఫెక్ట్ చూపుతుంది. అయితే బాబు వచ్చాక నూజివీడు నేతలకు క్లాస్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి.