పల్లెపై పట్టు..వాలంటీర్లు కొనసాగింపు..లోకేష్ స్కెచ్.!

ఏపీలో తెలుగుదేశం పార్టీ అర్బన్ ప్రాంతాలతో పోలిస్తే రూరల్ ప్రాంతాల్లో కాస్త వీక్ గా ఉందనే చెప్పాలి. రూరల్ ఏరియాల్లో వైసీపీ బలంగా ఉంది. గత ఎన్నికల్లో వైసీపీ రూరల్ ప్రాంతాల్లో సత్తా చాటింది..టోటల్ గా స్వీప్ చేసింది. అయితే ఇపుడుప్పుడే సీన్ మారుతుంది..రూరల్ ప్రాంతాల్లో కూడా వైసీపీపై వ్యతిరేకత వస్తుంది. దీంతో టి‌డి‌పి బలపడుతుంది. ఈ క్రమంలోనే నారా లోకేష్ పాదయాత్ర పక్కగా రూరల్ ప్రాంతాల్లోనే సాగుతుంది.

దీని వల్ల గ్రామీణ ప్రాంతాల్లో టి‌డి‌పి బలం పెరగడమే లక్ష్యంగా లోకేష్ ముందుకెళుతున్నారు. అలాగే గ్రామాల్లో వర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక తాజాగా ఆయన సర్పంచ్ లతో సమావేశం నిర్వహించారు. వైసీపీ వచ్చాక సర్పంచ్ వ్యవస్థ నిర్వీర్యమైంది. పంచాయితీ నిధులని సైతం వేరే వాటికి మళ్లిస్తున్నారు. గ్రామాల్లో అభివృద్ధి చేయాలంటే నిధులు ఉండటం లేదు. దీంతో సర్పంచ్ లు అసంతృప్తిగా ఉన్నారు. వైసీపీ సర్పంచ్ లే సొంత పార్టీపై ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అందరు సర్పంచ్ లతో లోకేష్ సమావేశమయ్యారు. గ్రామాల్లో సమస్యలు తెలుసుకున్నారు.

ఈ క్రమంలోనే టి‌డి‌పి అధికారంలోకి వస్తే వాటర్‌గ్రిడ్‌ ద్వారా 24 గంటలూ తాగునీరు అందిస్తామని, పల్లెసీమలను ప్రగతి పథంలో నడిపిస్తామని, నేరుగా పంచాయతీ ఖాతాలకే నిధులిస్తామని,  సర్పంచుల గౌరవ వేతనం పెంచుతామని హామీ ఇచ్చారు. అదే సమయంలో వైసీపీ తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.

టీడీపీ అధికారంలోకి వస్తే సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తామని ఏనాడూ చెప్పలేదని, వాటిని పంచాయతీలకు అనుసంధానం చేసి పల్లె సీమలను ప్రగతి పథంలో నడిపిస్తామని అన్నారు. ఇలా లోకేష్ హామీలతో గ్రామీణ ప్రజలని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.