పుష్పరాజ్ అమ్మవారి గెటప్ వెనుక ఇంత కథ ఉందా..?

సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమా కనీ వినీ ఎరుగని రీతిలో బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. ఇందులోని పాటలు ప్రపంచాన్ని ఉర్రూతలూగించాయి. ఈ మూవీకి కొనసాగింపుగా పుష్ప 2 రూపొందుతుండగా అందరి కళ్లు దీనిపైనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బన్నీ బర్త్ డే స్పెషల్‌గా పుష్ప 2లోని పుష్పరాజ్ లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. అదే టైమ్‌లో అల్లు అర్జున్ అమ్మవారి అవతారంలో ఉన్న మరో ఫోటో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.

ఈ పిక్‌లో బన్నీ చీరకట్టులో చేతికి గాజులు వేసుకుని ఒంటిపై బంగారం ధరించి, చేత గన్ పట్టి ఉగ్రరూపంలో మహిషాసురమర్దినిగా దర్శనమిచ్చాడు. ఈ గెటప్ చూస్తుంటేనే పూనకాలు వచ్చాయంటే అతిశయోక్తి కాదు. ఇదిలా ఉండగా బన్నీ ఈ గెటప్ ఎందుకు వేసుకున్నాడంటూ చాలా మంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరి దీని వెనక ఉన్న కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..

ఏటా తిరుపతిలో గంగమ్మ జాతర వైభవంగా జరుగుతుంది. ఈ వేడుకలో మగవారు ఆడవారి అవతారంలో కనిపించడం ఆచారంగా వస్తోంది. ఇదే జాతరను సుక్కు పుష్ప-2 సినిమాలో చూపించనున్నాడట. అప్పట్లో అంటే చాలా ఏళ్ల క్రితం తిరుపతి పరిసర ప్రాంతాల్లో పాలేగాండ్ల పాలకులుగా కొనసాగేవారు. వారు అమాయకుల ప్రజలను పట్టిపీడించేవారు ముఖ్యంగా ఆడపిల్లల మానాలను దోచేవారు. ఎవరైనా పెళ్లి చేసుకుంటే చాలు వారిని వరుడు కంటే ముందే వీరు అనుభవించేవారు. ఇలాంటి నీచుల భరతం పట్టేందుకు, ఆడవారి మాటలను రక్షించేందుకు అమ్మవారు గంగమ్మ రూపంలో కకైకాల కులంలో గంగమ్మ జన్మించిందని చెబుతారు.

అలా జన్మించిన అమ్మవారు పాలేగాండ్ల ప్రాణాలను తీసేసిందట. దీంతో భయపడిపోయిన వారు అడవిలోకి పోయి దాక్కునే వారట. వారిని బయటకు రప్పించేందుకు గంగమ్మ తల్లి మారు వేషంలో అడవిలో తిరుగుతుండేదని పురాణాలు చెబుతున్నాయి. ఆ విధంగా అడవిలో తిరుగుతూ ఆమె అందర్నీ చంపేశారట. ఇక ఇప్పుడు పుష్ప 2లో కూడా సుకుమార్ ఇదే చూపించనున్నారని తెలుస్తోంది. అందుకే బన్నీ ఈ గెటప్ లో దర్శనమిచ్చినట్టు ప్రచారం సాగుతోంది.