ఏపీ-తెలంగాణ మాటల యుద్ధం..స్క్రిప్ట్ ఉందా?

మరొకసారి ఏపీ, తెలంగాణ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది..రెండు రాష్ట్రాల్లోని అధికార పార్టీలోని మంత్రులు మాటల యుద్ధానికి దిగారు. మొదట తెలంగాణ మంత్రి హరీష్ రావు..తనదైన శైలిలో ఏపీ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. తెలంగాణలో స్థిరపడ్డ ఏపీ కార్మికులు అంతా..తెలంగాణలోనే ఓటు నమోదు చేసుకోవాలని, అసలు ఏపీతో పోలిస్తే తెలంగాణ బెటర్ అనే సంగతి చూస్తున్నారు కదా..అందుకే ఇక్కడే ఓటు నమోదు చేసుకోవాలని కోరారు.

ఏపీకి ప్రత్యేక హోదాను కేంద్రం ఇవ్వకున్నా.. అక్కడి అధికార పక్షం అడగదు, ప్రతిపక్షం ప్రశ్నించదని,  అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా తెలంగాణ పయనిస్తుంటే.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మంత్రులు తెలంగాణలో ఏముందని అడుగుతుండడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. విశాఖ ఉక్కును తుక్కుకు అమ్మినా మాట్లాడని పరిస్థితుల్లో మీరున్నరని అన్నారు. హరీష్ వ్యాఖ్యలకు ఏపీ మంత్రులు కౌంటర్లు ఇచ్చారు. “హరీశ్‌… మా ఆంధ్ర రాష్ట్రం రా. పదిళ్లు తిరుగు.. వందిళ్లు తిరుగు… ఎక్కడైనా తిరుగు… జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలైనా సరే వాళ్ల ఇంటికి వెళితే జగన్మోహన్‌రెడ్డి రావాలి, మాకు కావాలి అంటున్నారు.” అని చెప్పుకొచ్చారు.

హరీశ్‌రావ్‌… మీరు ఒకసారి ఆంధ్రప్రదేశ్‌ వచ్చి, చూసి తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని కామెంట్ చేశారు. విద్యలో 14వ స్థానంలో ఉన్న ఏపీ.. ఈ రోజు మూడో స్థానానికి వచ్చిందంటే మా జగన్‌ కృషే కారణమని, జీడీపీలో కూడా నంబర్‌ వన్‌గా ఉన్నామని, ఏరకంగా రాష్ట్రాన్ని మీరు తగలేసుకున్నారో మీ ప్రతిపక్షాలే చెబుతున్నాయని  మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు.

ఇలా రెండు రాష్ట్రాల మంత్రుల మధ్య మాటల యుద్ధం రేగింది..అయితే ఇదంతా ఓ స్క్రిప్ట్ ప్రకారం నడుస్తుందా? లేక మామూలుగానే విమర్శలు చేసుకుంటున్నారా? అనేది క్లారిటీ లేదు. ఎందుకంటే మొదట నుంచి ఇటు జగన్, అటు కే‌సి‌ఆర్ సఖ్యతగా ఉంటున్నారు. మరి ఇప్పుడు ఇలా మాటల యుద్ధం దిగడం వెనుక ఏదో కాన్సెప్ట్ ఉందనే విశ్లేషకులు అంటున్నారు.