ఎమ్మెల్యేల కొనుగోలు..నీతులు ఎవరికి?

ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. టీడీపీ అభ్యర్ధి అనూహ్యంగా 23 ఓట్లు తెచ్చుకుని ఎమ్మెల్సీగా గెలిచారు. మొత్తం 7 స్థానాలకు ఎన్నికలు జరగగా..వైసీపీ 7 గురు అభ్యర్ధులని బరిలో దింపింది..టీడీపీ ఒక అభ్యర్ధిని రంగంలోకి దింపింది..అయితే ఒక్కో ఎమ్మెల్సీ గెలవాలంటే 22 మంది ఎమ్మెల్యేలు కావాలి. ఇక వైసీపీకి 151 ఎమ్మెల్యేల బలం ఉంది..ఇక టి‌డి‌పి నుంచి నలుగురు, జనసేన నుంచి ఒకరు వైసీపీలోకి వచ్చారు.

దీంతో వైసీపీ బలం 156..అందులో ఇద్దరు రెబల్స్ ఉన్నారు. వారిని తీస్తే 154..అంటే 7 సీట్లు గెలుచుకునే కరెక్ట్ బలం ఉంది. టి‌డి‌పికి 19 మంది..ప్లస్ వైసీపీ రెబల్స్ ఇద్దరు. ఇక వారికి తోడుగా మరో ఇద్దరు వైసీపీ నుంచి టి‌డి‌పికి క్రాస్ ఓటింగ్ వేశారు. దీంతో టి‌డి‌పి ఒక స్థానం గెలిచింది. వైసీపీ 6 స్థానాల్లో గెలిచింది. అయితే వైసీపీ నుంచి టోటల్ గా నలుగురు క్రాస్ ఓటింగ్ వేశారు. ఆనం రామ్ నారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ముందుగానే రెబల్స్ గా మారారు.

వారిద్దరితో పాటు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి సైతం క్రాస్ ఓటింగ్ వేశారని వైసీపీ అధిష్టానం నిర్దారణకు వచ్చింది. ఈ క్రమంలో వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఒక్కో ఎమ్మెల్యేకు 15-20 కోట్ల వరకు ఇచ్చి చంద్రబాబు కొనుగోలు చేశారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.

ఇక సజ్జల ఆరోపణలకు టి‌డి‌పి గట్టి కౌంటర్లు ఇస్తుంది..అలాంటప్పుడు తమ పార్టీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలని వైసీపీ ఎంతకు కొనుగోలు చేసిందో చెప్పాలని డిమాండ్ చేస్తుంది. తమ ఎమ్మెల్యేలని కొనుగోలు చేసి ఇప్పుడు వైసీపీ నీతులు చెబుతుందని టి‌డి‌పి నేతలు ఫైర్ అవుతున్నారు. ఇక ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అన్నీ డబ్బులు పెట్టగలదా? అనే లాజిక్ వైసీపీకి లేదని, అయినా వైసీపీ చేసే ఆరోపణలు జనం నమ్మే పరిస్తితి లేదని అంటున్నారు.