వైసీపీకి దెబ్బపై దెబ్బ..డ్యామేజ్ కంట్రోల్ చేస్తారా?

రాజకీయాల్లో ఎప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. అది ఉంటే ఎప్పుడొకప్పుడు దెబ్బ తినక తప్పదు..ఇప్పుడు ఏపీలో అధికార వైసీపీకి అదే పరిస్తితి ఎదురవుతున్నట్లు కనిపిస్తుంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి తమకు అసలు తిరుగులేదనే విధంగానే ముందుకెళుతుంది. అలాగే ఏ ఎన్నిక చూసిన వైసీపీదే గెలుపు కావడంతో ఇంకా వైసీపీ నేతలు ఎక్కడా తగ్గలేదు.

అధికార బలంతో పంచాయితీ, పరిషత్, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో విజయ విహారం చేశారు. ఏ ఉపఎన్నిక వచ్చిన వైసీపీదే గెలుపు. ఆఖరికి చంద్రబాబు సొంత స్థానం కుప్పంలో కూడా వైసీపీ హవా నడిచింది. ఇంకా అంతే అదిగో కుప్పం కూడా నెక్స్ట్ కొట్టబోతున్నాం..వై నాట్ 175 అనే టార్గెట్ పెట్టుకుని ముందుకెళుతున్నారు. అంటే 175కి 175 సీట్లు ఎందుకు గెలవలేమనేది వైసీపీ కాన్సెప్ట్. అలాగే ప్రజలంతా తమ వైపే ఉన్నారనేది వైసీపీ భావన.

కానీ అది కరెక్ట్ కాదని ఇప్పుడుప్పుడే తేలుతుంది. వరుసగా గెలుస్తున్న వైసీపీ ఎదురుదెబ్బలు తగలడం మొదలయ్యాయి. ఇటీవల బలం ఉంది కాబట్టి స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీలు గెలిచారు. అలాగే ప్రైవేట్ టీచర్లకు కూడా ఓటు హక్కు కల్పించి రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలని వైసీపీ గెలుచుకుంది. కానీ అసలైన పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీ బోల్తా కొట్టింది. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల స్థానాల్లో టి‌డి‌పి గెలిచింది. అంటే వైసీపీకి ఎక్కడైతే బలం ఉందని అనుకుంటుందో.అవే ప్రాంతాల్లో టి‌డి‌పి గెలిచి చూపించింది.

ఈ విజయాలు ఒక ఎత్తు అనుకుంటే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టి‌డి‌పి గెలవడం మరొక ఎత్తు..తమ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీ వైపుకు వెళ్ళినా సరే 19 మంది బలం ఉన్న సరే టి‌డి‌పి తరుపున చంద్రబాబు అభ్యర్ధిని నిలబెట్టి సక్సెస్ అయ్యారు. వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేయడంతో టి‌డి‌పి గెలిచింది. మొత్తానికి వైసీపీ ఎదురుదెబ్బలు గట్టిగానే తగిలాయి.