మూడు కాదు..ఒకటే రాజధాని..వైసీపీ స్ట్రాటజీ!

అధికార వైసీపీ ఏది చేసిన దాని వెనుక రాజకీయం మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. ప్రతి కార్యక్రమం వెనుక రాజకీయ ఉద్దేశం ఉంటుంది..ఓ స్ట్రాటజీ ఉంటుందనే చెప్పాలి. ఆ స్ట్రాటజీలో భాగంగానే మూడు రాజధానుల కాన్సెప్ట్ తెరపైకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. టి‌డి‌పి అధికారంలో ఉండగా అమరావతి రాజధానికి ఓకే చెప్పిన జగన్..అధికారంలోకి రాగానే మూడు రాజధానులు అన్నారు. అమరావతి శాసనరాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా, విశాఖ పరిపాలన రాజధానిగా ఉంటుందని చెప్పారు.

అలా మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. అభివృద్ధి చేయాలంటే ఎలాగైనా చేయవచ్చు. కానీ వైసీపీ మూడు రాజధానుల కాన్సెప్ట్ వేరు. ఇక ఈ రాజ్ధనులపై మూడున్నర ఏళ్ల నుంచి రచ్చ నడుస్తోంది. ప్రస్తుతం ఈ అంశం సుప్రీం కోర్టులో ఉంది. అయితే కోర్టులో ఉండగానే..వైసీపీ కొత్త నినాదం అందుకుంది. విశాఖ మాత్రమే రాజధాని అనే కాన్సెప్ట్ తెరపైకి తెచ్చింది. మొదట ఈ అంశాన్ని మంత్రి ధర్మాన ప్రసాదరావు క్లారిటీ ఇచ్చారు. విశాఖ ఒకటే రాజధాని అన్నారు. తర్వాత జగన్..విశాఖ రాజధాని అని చెప్పారు. తాజాగా ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేందర్‌నాథ్ రెడ్డి సైతం ఒకటే రాజధాని అని చెప్పారు.

బెంగళూరులో జరిగిన… ‘బెంగళూరు ఇండస్ట్రీ మీట్‌’లో బుగ్గనతోపాటు పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ క్రమంలో బుగ్గన మాట్లాడుతూ మూడు రాజధానులనేది ఒక మిస్‌ కమ్యూనికేషన్‌ అని,  పరిపాలన విశాఖపట్నం నుంచే జరుగుతుందని,  ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాల దృష్ట్యా చూస్తే… రాజధానిగా అదే ఉత్తమం అని, కర్నూలు రెండో రాజధాని కాదని,  అక్కడ హైకోర్టు ఉంటుందంతే.. ఇక ఒక సెషన్‌ గుంటూరులో శాసనసభ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించామని చెప్పుకొచ్చారు. దీంతో రాజధాని ఒకటే అది విశాఖ అని తేల్చి చెప్పేశారు. అయితే ఓ స్ట్రాటజీ ప్రకారం..ఒకటే రాజధాని అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళుతున్నట్లు తెలుస్తోంది.