కాకినాడ రూరల్‌లో టీడీపీకి కొత్త క్యాండిడేట్.!

తెలుగుదేశం పార్టీకి ఇంకా కొన్ని సీట్లలో సరైన నాయకత్వం లేదనే చెప్పాలి. ఎన్నికలు దగ్గరపడుతున్న సరే కొన్ని స్థానాల్లో ఇంచార్జ్‌లు కనిపించడం లేదు. దాదాపు అన్నీ స్థానాల్లో నేతలని పెట్టారు గాని ఇంకా కొన్ని స్థానాలు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ రూరల్ సీటు ఖాళీగానే ఉంది. ఈ సీటు కోసం చాలామంది నేతలు పోటీ పడుతున్నారు. అయితే గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి పిల్లి అనంత లక్ష్మీ పోటీ చేసి ఓడిపోయారు.

ఇక ఎన్నికల్లో ఓడిపోయాక తన భర్త పిల్లి సత్యనారాయణ మూర్తితో కలిసి పార్టీని వీడారు. కొన్ని కారణాల వల్ల వారు పార్టీకి దూరమయ్యారు. మళ్ళీ ఏమైందో గాని..వారు పార్టీలోకి వచ్చారు. యాక్టివ్ గా పనిచేయడం మొదలుపెట్టారు. కానీ వారికి ఇంచార్జ్ పదవి ఇచ్చే విషయంలో చంద్రబాబు వెనుకడుగు వేస్తున్నారు. రూరల్ లో బలమైన నాయకుడుని పెట్టాలని చూస్తున్నారు. పిల్లి దంపతులు నిలకడగా లేకపోవడంతో వారికి రూరల్ బాధ్యతలు ఇచ్చే విషయంలో ఆలోచన లో ఉన్నారు.

ఇదే సమయంలో నియోజకవర్గం బాధ్యతలని కాపు నాయకుడైన పేరాబత్తుల రాజశేఖర్‌కు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారని తెలిసింది. మొదట నుంచి రాజశేఖర్ పార్టీకి విధేయుడుగా పనిచేస్తున్నారు. టి‌డి‌పి అధికారంలో ఉన్నప్పుడు ఈయనకు కీలక పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. అయినా సరే ఆయనకు పదవి దక్కలేదు. కానీ రాజశేఖర్..ఏ నాడు పార్టీని విమర్శించలేదు. అలాగే పార్టీకి పనిచేస్తూ వచ్చారు.

2014లో జెడ్పీటీసీగా గెలిచారు..అప్పుడు జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవి వస్తుందని ఆశించారు. కానీ పదవి రాలేదు. అయితే పార్టీ కోసం నిబద్ధతతో పనిచేస్తున్న రాజశేఖర్‌కు కాకినాడ రూరల్ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం ఉంది. చూడాలి మరి కాకినాడ రూరల్ సీటు ఎవరికి దక్కుతుందో.