సీటుపై అవంతి క్లారిటీ..మళ్ళీ గెలుపు దక్కేనా?

ఇటీవల కాలంలో అధికార వైసీపీలో కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి చూస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామ్ నారాయణ రెడ్డి..వైసీపీకి దూరమయ్యారు. ఈ క్రమంలోనే ఇంకా పలువురు ఎమ్మెల్యేలు వైసీపీని వీడాలని చూస్తున్నారని ప్రచారం జరుగుతుంది. నెక్స్ట్ ఎన్నికల్లో సీటు దక్కని వారు ఖచ్చితంగా వైసీపీకి షాక్ ఇస్తారని ప్రచారం జరుగుతుంది.

ఇదే క్రమంలో మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ సైతం వైసీపీని వీడతారని ప్రచారం వస్తుంది. అయితే ఎన్నిక ఎన్నికకు పార్టీలు మారుస్తూ గెలుస్తూ వస్తున్న అవంతి ఈ సారి కూడా పార్టీ మారడం ఖాయమని సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది. ఈయన 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం నుంచి భీమిలిలో పోటీ చేసి గెలిచారు. 2014లో టి‌డి‌పి నుంచి అనకాపల్లి ఎంపీగా గెలిచారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి భీమిలిలో గెలిచారు.

ఇలా వరుసగా పార్టీలు మారుస్తూ గెలుస్తూ వస్తున్నారు. అయితే ఈ సారి కూడా అదే బాటలో వెళ్తారని టాక్ నడిచింది. పైగా ఈ సారి భీమిలిలో అవంతికి గెలిచే అవకాశాలు తక్కువ ఉన్నాయని, ఆయన పార్టీ మారతారని ప్రచారం వచ్చింది. ఈ క్రమంలోనే ఆయన క్లారిటీ ఇస్తూ..తాను వైసీపీని వీడే ప్రసక్తి లేదని, వచ్చే ఎన్నికల్లో భీమిలి నుంచే పోటీ చేసే గెలుస్తానని చెప్పుకొచ్చారు. ప్రత్యర్ధి ఎవరైనా గెలుపు తనదే అన్నారు.

అయితే గత ఎన్నికల్లో టి‌డి‌పి-జనసేనల మధ్య ఓట్లు చీలడం వల్ల అవంతికి గెలుపు సాధ్యమైంది. ఈ సారి మాత్రం రెండు పార్టీలు పొత్తులో వచ్చేలా ఉన్నాయి. అదే జరిగితే అవంతి గెలుపుకు రిస్క్ అని చెప్పవచ్చు.