గోదావరిలో వైసీపీకి చిక్కులు..ఎన్ని వికెట్లు పడతాయో..!

రాజకీయంగా గోదావరి జిల్లాలపై పట్టు సాధించిన పార్టీ..రెండు ఉమ్మడి జిల్లాల్లో ఎక్కువ సీట్లు గెలిచిన పార్టీ ఖచ్చితంగా రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమనే చెప్పాలి. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు కలిపి మొత్తం 34 సీట్లు ఉన్నాయి. వీటిల్లో మెజారిటీ సీట్లు దక్కించుకున్న పార్టీకి అధికారం ఈజీ. గత ఎన్నికల్లో రెండు జిల్లాల్లో వైసీపీ సత్తా చాటింది. తూర్పులో 19 సీట్లు ఉంటే వైసీపీ 14, టీడీపీ 4, జనసేన 1 సీటు గెలుచుకుంది.

పశ్చిమలో 15 సీట్లు ఉంటే వైసీపీ 13, టీడీపీ 2 సీట్లు గెలుచుకుంది. అయితే ఈ రెండు జిల్లాల్లో వైసీపీ ఇంతటి భారీ విజయాలు అందుకోవడానికి ప్రధాన కారణం జగన్ వేవ్ కాదు..జనసేన ఓట్లు చీల్చడం. ఈ రెండు జిల్లాల్లో భారీ స్థాయిలో జనసేన ఓట్లు చీల్చి టీడీపీకి నష్టం, వైసీపీకి లాభం జరిగేలా చేసిందని చెప్పవచ్చు. సుమారు రెండు జిల్లాల్లో కలిపి ఓ 15 పైనే సీట్లలో జనసేన ఓట్లు చీల్చింది. ఆ స్థానాల్లో వైసీపీకి టీడీపీపై వచ్చిన మెజారిటీల కంటే జనసేనకు పడిన ఓట్లు ఎక్కువ.

దీని బట్టి చూస్తే రెండు పార్టీలు కలిస్తే వైసీపీ పరిస్తితి ఏం అయ్యేదో ఊహించుకోవచ్చు. ఇక వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు పొత్తులో పోటీ చేయడానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. దీంతో రెండు జిల్లాల్లో వైసీపీ చిక్కుల్లో పడినట్లే అని తెలుస్తోంది. తూర్పులో పొత్తు ప్రభావం ఎక్కువగా ఉండేలా ఉంది. 19 సీట్లు ఉంటే టీడీపీ-జనసేన పొత్తులో 14 సీట్లు వరకు గెలుచుకునే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అంటే వైసీపీకి 5 సీట్లు వరకు గెలుచుకునే ఛాన్స్ కనిపిస్తోంది.

అటు పశ్చిమలో వైసీపీకి 3-4 సీట్లు వస్తాయని, మిగిలిన సీట్లు టీడీపీ-జనసేన గెలుచుకుంటాయని అంటున్నారు. అంటే రెండు జిల్లాల్లో వైసీపీ భారీగా నష్టపోయేలా ఉంది.