`వాల్తేరు వీర‌య్య‌` బిజినెస్‌.. చిరు గ‌త చిత్రాల‌తో పోలిస్తే చాలా త‌క్కువ‌!

ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి `వాల్తేరు వీరయ్య` సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. బాబి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రను పోషించాడు. శృతిహాసన్, కేథరిన్ ఇందులో హీరోయిన్లుగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వ‌రాలు అందించాడు.

సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 13న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఇప్ప‌టికే ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ‌టంతో.. బిజినెస్ కూడా బాగానే జ‌రిగింది. కానీ, చిరు గ‌త చిత్రాల‌తో పోలీస్తే వీర‌య్య‌కు జరిగిన బిజినెస్ చాలా త‌క్కువ‌నే చెప్పొచ్చు. చిరంజీవి రీఎంట్రీ మూవీ `ఖైదీ నెంబర్ 150`కు రూ. 89 కోట్ల రేంజ్ లో థియేట్రిక‌ల్‌ బిజినెస్ జ‌ర‌గ‌గా.. ఈ టార్గెట్ సినిమా ఈజీగా పూర్తి చేసుకుంది. ఆ తర్వాత చిరు నుంచి వచ్చిన పాన్ ఇండియా మూవీ `సైరా` రూ. 195 కోట్ల బిజినెస్ చేసింది. అయితే ఆ సినిమా చాలా ఏరియాలలో నష్టాలను మిగిల్చింది.

అపై చిరంజీవి న‌టించిన‌ ఆచార్య సినిమా రూ. 136 కోట్ల వరకు బిజినెస్ చేయగా.. రూ. 50 కోట్లు కూడా క‌లెక్ట్ చేయ‌లేక డిజాస్ట‌ర్ గా మిగిలింది. ఇక `గాడ్ ఫాదర్` సినిమాకు రూ. 90 కోట్ల వరకు బిజినెస్ జ‌రిగింది. కానీ ఈ సినిమా ఆ టార్గెట్ ను పూర్తి చేయలేకపోయింది. ఇప్పుడు `వాల్తేరు వీరయ్య` సినిమాకు రూ. 88 కోట్ల రేంజ్ లో బిజినెస్ జ‌రిగిందని అంటున్నారు. మ‌రి ఈ సారి చిరంజీవి ఈ టార్గెట్ ను రీచ్ అవుతారా..లేదా.. అన్న‌ది చూడాలి.