బిగ్ బ్రేకింగ్ : సీనియర్ నటి జమున ఇక‌లేరు!

సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. టాలీవుడ్ అనే కాదు బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్‌.. ఇలా చాలా భాషల‌కు చెందిన సినీ ప్రముఖులు క‌న్నుమూస్తున్నారు. తాజాగా టాలీవుడ్ లో మ‌రో తీవ్ర విషాదం నెల‌కొంది. సీనియర్‌ నటి జమున(86) ఇకలేరు. వయోధికభారంతో హైదరాబాద్‌లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.

జమున భైతికకాయాన్ని ఉదయం 11 గంటలకు ఫిల్మ్‌చాంబర్‌కు తరలిస్తారు. ఆమె మ‌ర‌ణంతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. జమున 1936 ఆగస్ట్‌ 30న హంపీలో జన్మించారు. 1953లో పుట్టిల్లు సినిమాతో జమున సినీ ఆరంగేట్రం చేశారు. తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాష‌ల్లో న‌టించి ఆగ్ర‌హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు.

తెలుగులో రామారావు, అక్కినేని, జగ్గయ్య వంటి అలనాటి అగ్రహీరోల సరసన నాయికగా నటించారు. తెలుగు, దక్షిణభారత భాషల్లో కలిపి ఆమె 198 సినిమాలు చేశారు. పలు హిందీ సినిమాలలో కూడా నటించారు. త‌న సినీ కెరీర్ లో జ‌మున ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నాయి. కాగా, 1965లో జూలూరి రమణరావును జమున వివాహం చేసుకున్నారు. వీరికి కుమారుడు వంశీకృష్ణ, కూతురు స్రవంతి జ‌న్మించారు. జ‌మున భ‌ర్త 2014లో గుండెపోటుతో మ‌ర‌ణించారు.