టీడీపీలో సీట్ల గోల: పెందుర్తి అవుట్..బుచ్చిబాబుకు డౌట్?

నెక్స్ట్ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి అధికారంలోకి రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు గట్టిగా కష్టపడుతున్నారు. అలాగే ప్రతి స్థానంలో టీడీపీ బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎప్పటికప్పుడు నాయకులకు దిశానిర్దేశం చేస్తూ..పార్టీని బలోపేతం చేస్తున్నారు. అయితే సరిగా పనిచేయని నాయకులకు మాత్రం క్లాస్ ఇస్తున్నారు. అవసరమైతే సీటు కూడా ఇవ్వనని చెప్పేస్తున్నారు.

ఇదే క్రమంలో ఇటీవల రాజానగరం మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌కు బాబు క్లాస్ ఇచ్చారు. సరిగ్గా పనిచేయకపోవడం వల్ల..బలంగా ఉండే స్థానంలో పార్టీని వీక్ చేశారని అన్నారు. అవసరమైతే పెందుర్తిని పక్కన పెట్టేస్తానని వార్నింగ్ ఇచ్చారు. దీంతో మనస్తాపానికి గురైన పెందుర్తి..రాజానగరం ఇంచార్జ్ పదవికి రాజీనామా చేశారు. ఆ సీటు ఎవరికి ఇచ్చిన..వారి గెలుపు కోసం పనిచేస్తానని చెప్పుకొచ్చారు. అయితే పొత్తు ఉంటే ఈ సీటుని జనసేనకు ఇస్తారని ప్రచారం జరుగుతుంది. రాజానగరంలో జనసేనకు కాస్త బలం ఉంది.

ఇక జనసేనకు టీడీపీ తోడైతే..వైసీపీపీకి చెక్ పెట్టవచ్చు. అయితే జనసేనకు సీటు ఇస్తారనే నేపథ్యంలోనే పెందుర్తి తప్పుకున్నారని అంటున్నారు. ఇదిలా ఉంటే అటు ముమ్మిడివరం సీటు కూడా జనసేనకు ఇస్తారని ప్రచారం వస్తుంది. ఇదే సమయంలో సీటు విషయంలో మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు స్పందించారు. ఎట్టి పరిస్తితుల్లోనూ..ముమ్మిడివరం సీటు తనదే అని, అందులో డౌట్ లేదని, అలాగే తాను వైసీపీలోకి వెళ్తానని ప్రచారం చేస్తున్నారని, నా తుది శ్వాస వరకు టీడీపీలోనే ఉంటానని, చంద్రబాబుతోనే కలిసి పనిచేస్తానని చెప్పుకొచ్చారు.

అయితే ముమ్మిడివరం సీటుపై ఇంకా చంద్రబాబు క్లారిటీ ఇవ్వలేదు. అంటే జనసేనతో పొత్తు దృష్టిలో పెట్టుకుని సీటుపై ప్రకటన ఇవ్వడం లేదా? లేక ఎన్నికల ముందు సీటు ప్రకటిస్తారా? అనేది క్లారిటీ లేదు. మొత్తానికి కొందరి తమ్ముళ్ళు సీటు త్యాగం చేయాల్సిన పరిస్తితి ఉంది.