రాయలసీమపైనే ఫోకస్..పాదయాత్రతో సెట్ అవుతుందా?

రాయలసీమలో అధికార వైసీపీకి బలం ఎక్కువనే సంగతి తెలిసిందే..సీమలో ఉన్న నాలుగు ఉమ్మడి జిల్లాల్లో వైసీపీ స్ట్రాంగ్ గా ఉంది. గత ఎన్నికల్లో సీమ మొత్తం 52 సీట్లు ఉంటే వైసీపీ 49 సీట్లు గెలుచుకుంది..టీడీపీ కేవలం 3 సీట్లు మాత్రమే గెలుచుకుంది. అంటే సీమలో వైసీపీ హవా ఏ మేర ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికీ అక్కడ వైసీపీ ఆధిక్యం ఉంది. అయితే వైసీపీకి చెక్ పెట్టి టీడీపీ బలం పెంచడానికి చంద్రబాబు గట్టిగానే కష్టపడుతున్నారు. ప్రస్తుతానికి సీమలో టీడీపీ బలం కొంతమేర పెరిగింది..కానీ లీడింగ్ మాత్రమే వైసీపీదే.

అయితే వైసీపీ బలం ఇంకా తగ్గించడానికే టీడీపీ ప్రయత్నిస్తుంది. ఇదే క్రమంలో లోకేష్ పాదయాత్ర ద్వారా..సీమలో బలపడాలని టీడీపీ ప్లాన్ చేసింది. అందుకే కోస్తా కంటే..సీమలో ఎక్కువ స్థానాల్లో పాదయాత్ర ఉండేలా రూట్ మ్యాప్ ఖరారు చేశారు. జనవరి 27న కుప్పంలో ప్రారంభమవుతున్న పాదయాత్ర..చిత్తూరు జిల్లాలోని 14 స్థానాల్లో కొనసాగనుంది. అంటే చంద్రబాబు సొంత జిల్లా కావడంతో..ఇక్కడ అన్నీ స్థానాల్లో పాదయాత్ర ఫిక్స్ చేశారు.

ఇక తర్వాత టీడీపీ కంచుకోటగా ఉన్న అనంతపురంలో ప్లాన్ చేశారు. ఈ జిల్లాలో కదిరి, ధర్మవరం, పుట్టపర్తి, పెనుకొండ, హిందూపురం, రాప్తాడు, రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ, అనంతపురం, తాడిపత్రి, శింగనమల, గుంతకల్ స్థానాల్లో పాదయాత్ర ఉంటుంది. ఒక్క మడకశిర మినహా మిగిలిన అన్నీ స్థానాలని కవర్ చేస్తున్నారు. అటు కర్నూలులో 14 సీట్లు ఉంటే..12 సీట్లలో పాదయాత్ర ప్లాన్ చేశారు. శ్రీశైలం, నందికొట్కూరు మినహా మిగిలిన స్థానాల్లో పాదయాత్ర ఉంది.

ఇటు కడపలో 10 స్థానాలు ఉండగా..7 స్థానాల్లో పాదయాత్ర ఉంటుంది. మొత్తానికి రాయలసీమలో ఎక్కువ స్థానాల్లో పాదయాత్ర కొనసాగనుంది. మరి పాదయాత్రతో సీమలో టీడీపీకి బెనిఫిట్ అవుతుందేమో చూడాలి.