టీడీపీలో కేశినేని-అయ్యన్న దూకుడు..సొంత వాళ్లపైనే!

రాజకీయాల్లో తాము ఉంటున్న పార్టీలకు నిబద్దతతో పనిచేయడమే నేతల కర్తవ్యం. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా..పార్టీ కోసం కష్టపడాలి. ఇక అలాంటి వారు తెలుగుదేశం పార్టీలో చాలామంది ఉన్నారు. అయితే అధికారంలో లేకపోవడం వల్ల పనిచేయని వారు..వెనుక గోతులు తీస్తూ సొంత పార్టీ నేతలనే దెబ్బతీసే వారు ఉన్నారు. ఇక అలాంటి వారిపై ఇటీవల ఇద్దరు టీడీపీ సీనియర్లు గళం ఎత్తారు.

ఇటు విజయవాడలో ఎంపీ కేశినేని నాని..పార్టీని అమ్ముకున్న వారు వద్దని, పార్టీలో ప్రక్షాళన జరగాలని, కాల్ మనీ వ్యవహారాల్లో ఉండేవారికి సీట్లు ఇస్తే సహకరించనని చెబుతున్నా విషయం తెలిసిందే. బుద్దా వెంకన్న, దేవినేని ఉమా, బోండా ఉమా, కేశినేని శివనాథ్ టార్గెట్ గా కేశినేని ఫైర్ అవుతున్నారు. అటు వారు సైతం పరోక్షంగా కేశినేని నానికి కౌంటర్లు ఇస్తున్నారు. అదే సమయంలో ఎవరికి సీటు ఇచ్చిన సహకరిస్తామని అంటున్నారుల. ఇలా విజయవాడలో కేశినేని పర్టీ కోసం గళం విప్పితే అటు విశాఖలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు గళం విప్పారు.

అది కూడా ఇంతకాలం పర్టీ అధికారంలో లేదని చెప్పి సైలెంట్ గా ఉండిపోయి..ఇప్పుడు ఎన్నికలు దగ్గరకొస్తుండటం, అలాగే టీడీపీ-జనసేన పొత్తు ఖాయమవుతున్న తరుణంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మరోసారి పార్టీలో యాక్టివ్ అయ్యారు. ఇటీవలే లోకేష్‌ని కలిశారు. ఇలా ఇప్పుడు పార్టీలో యాక్టివ్ అవ్వడంపై అయ్యన్న..గంటా టార్గెట్ గా విరుచుకుపడ్డారు.

“ఎవడండీ గంటా? లక్షల్లో వాడొక్కడు. లక్షల్లో నేనొక్కడిని. గంటా ఏమైనా పెద్ద నాయకుడా? ప్రధానా? పార్టీలో అందరూ రావాలి.. పార్టీ కోసం అందరూ పని చేయాలి. కష్టకాలంలో కూడా పార్టీ కోసం పని చేయాలనేదే మా కోరిక”. అని అయ్యన్న ఫైర్ అయ్యారు. ఇక పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు బొక్కల్లో దాక్కున్నారని, ఇప్పుడు ఎన్నికలు దగ్గరకొస్తున్నాయని బయటకు వస్తున్నారని విరుచుకుపడ్డారు. మొత్తానికి అటు కేశినేని, ఇటు అయ్యన్న..సొంత నేతలపై ఫైర్ అవుతున్నారు.