రామచంద్రాపురంలో టీడీపీకి నో ప్లస్..జనసేనకే సీటు!

వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తులో పోటీ చేయడానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఈ రెండు పార్టీలు పొత్తులో పోటీ చేస్తే వైసీపీకి కొన్ని స్థానాల్లో ఎదురుదెబ్బ తగలడం ఖాయం. ఇక పొత్తులో భాగంగా టీడీపీ..జనసేన కోసం కొన్ని సీట్లు వదులుకోవాలి. ముఖ్యంగా జనసేన బలంగా ఉన్న ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కాస్త ఎక్కువ సీట్లే వదలాలి. అయితే ఇప్పటికే తూర్పులో కాకినాడ సిటీ లేదా రూరల్, రాజోలు, అమలాపురం, రాజానగరం, పిఠాపురం లాంటి సీట్లు జనసేనకు ఇస్తారనే ప్రచారం ఉంది.

అదే సమయంలో రాజమండ్రి రూరల్, రామచంద్రపురం లాంటి సీట్లు కూడా ఇస్తారని టాక్. అయితే రూరల్ సీటులో టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరీ ఉన్నారు…సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని, జనసేనకు సీటు ఇవ్వడం కష్టం. అయితే రామచంద్రపురం సీటు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ టీడీపీ అంత బలంగా కనబడటం లేదు. తోట త్రిమూర్తులు టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్ళాక ఇక్కడ టీడీపీ ఇంచార్జ్ గా రెడ్డి సుబ్రహ్మణ్యంని పెట్టారు. అయితే అంత దూకుడుగా పనిచేసి పార్టీని బలోపేతం చేయలేదు.

ఇక ఇక్కడ జనసేనకు కాస్త బలం పెరిగినట్లు కనిపిస్తోంది. అందుకే పొత్తులో భాగంగా ఈ సీటు జనసేనకు ఇస్తారని టాక్. టీడీపీ-జనసేన కలిస్తే ఇక్కడ వైసీపీకి చెక్ పడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ నుంచి చెల్లుబోయిన వేణుగోపాల్ పోటీ చేసి టీడీపీపై దాదాపు 5 వేల ఓట్ల మెజారిటీతోనే గెలిచారు. ఇక్కడ జనసేనకు 18 వేలు ఓట్లు పైనే పడ్డాయి. అంటే టీడీపీ-జనసేన కలిస్తే ఇక్కడ మంత్రి చెల్లుబోయినకు చెక్ పడే ఛాన్స్ ఉంది.