ఆనంకు టీడీపీలోకి లైన్ క్లియర్ చేసిన జగన్..!

గత కొంతకాలంగా సొంత ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణరెడ్డికి జగన్ చెక్ పెట్టారు. ఇప్పటికే ప్రభుత్వంపై పలుమార్లు విమర్శలు చేశారు. రోడ్లపై గుంతలు పూడ్చలేదని, కొత్త ప్రాజెక్టులు కట్టలేదని అలా అయితే జనంలోకి వెళ్లి ఓట్లేయమంటూ ఎలా అడుగుతామని అన్నారు. పింఛన్లు పెంచితే గెలిచేటట్లయితే… గతంలో చంద్రబాబు కూడా భారీగా పెంచారని.. అయినా గెలువలేదని గుర్తుచేస్తున్నారు.

మరోవైపు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి వెంకటగిరికి కాబోయే ఎమ్మెల్యే తానేనని చెప్పుకొంటూ వస్తున్నారు. దీనినీ ఆనం తప్పుబట్టారు. ఇదే సమయంలో తాజాగా కూడా ఆనం సంచలన వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికలు అంటున్నారని..అలా అంటే ముందే ఇంటికి వెళ్లాల్సి వస్తుందని కామెంట్ చేశారు. ఇదే అంశంపై జగన్ సీరియస్ అయినట్లు తెలిసింది. ముందస్తుకు వెళితే ముందే ఇంటికెళ్తామనే వ్యాఖ్యలపై సీరియస్ అయిన జగన్..ఆనంపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు.

వెంకటగిరిగా ఇంచార్జ్ నుంచి ఆనంని తప్పించి..నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఎప్పటినుంచో ఆనంకు నెక్స్ట్ సీటు ఇవ్వరని, నేదురుమల్లికి సీటు ఇస్తారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అనుకున్నట్లుగానే జరిగేలా ఉంది. అయితే ఆనం టీడీపీలోకి వెళ్తారని ప్రచారం జరుగుతుంది. టీడీపీలోకి వెళ్ళి నెల్లూరు సిటీలో పోటీ చేస్తారని అంటున్నారు.

అయితే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సైతం తమ ప్రభుత్వంపై విమర్శలు చేశారు..కానీ జగన్ కోటంరెడ్డిని పిలిచి సర్ది చెప్పారు..సమస్యలు తెలుసుకున్నారు. ఆనంని మాత్రం పిలవలేదు. ఇక తన నియోజకవర్గాన్ని నేదురుమల్లికి అప్పజెప్పడంపై..అధిష్టానంతో మాట్లాడి తెలుసుకుంటానని, తనకు ఎలాంటి సమాచారం లేదని ఆనం అంటున్నారు. ముందస్తు ఎన్నికలు వస్తే నిధులు ఫ్రీజ్‌ అయిపోతాయని,  ఆ కారణంతోనే త్వరగా పనులు పూర్తి చేయాలనే ఉద్దేశంతో అధికారులకు చెప్పానని ఆనం చెప్పారు. మరి చూడాలి రాజకీయ జీవితం ఏ మలుపు తిరుగుతుందో.