`వీర సింహారెడ్డి`తో సహా బాల‌య్య‌ ద్విపాత్రాభినయం చేసిన సినిమాలు ఇవే!

నేడు నట‌సింహం నందమూరి బాలకృష్ణ నుంచి `వీర సింహారెడ్డి` అనే మాస్ ఎంటర్టైనర్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం చేశాడు. శృతిహాసన్, హనీ రోజ్ హీరోయిన్లుగా నటించారు. నేడు హట్టహాసంగా విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇందులో వీర సింహారెడ్డి గా ఓవైపు, జై సింహా రెడ్డిగా మరోవైపు బాలయ్య తన నటన విశ్వరూపాన్ని చూపించాడు. అయితే వీరసింహారెడ్డి తో సహా బాలయ్య ఏ ఏ చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేశాడు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వ‌చ్చిన `అపూర్వ సహోదరులు` సినిమాలో బాల‌య్య కెరీర్ లోనే తొలిసారి డ్యుయల్ రోల్ లో న‌టించారు. ఆ త‌ర్వాత `రాముడు భీముడు`లో ద్విపాత్రాభినయం చేసిన బాల‌య్య‌.. ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’లో హరిశ్చంద్రుడిగా, దుష్యంతుడిగా రెండు పాత్రల్లో న‌టించారు. తెలుగులో ఆల్ టైమ్ క్లాసిక్ చిత్రాల్లో ఒక‌టిగా నిలిచిన `ఆదిత్య 369`లో బాల‌య్య డ‌బుల్ రోల్స్ ను ప్లే చేశారు.

ఆ త‌ర్వాత మాతో పెట్టుకోకు, శ్రీకృష్ణార్జున విజయం, పెద్దన్నయ్య, సుల్తాన్, చెన్నకేశవరెడ్డి, అల్లరి పిడుగు, ఒక్క మ‌గాడు, పరమవీరచక్ర, పాండురంగడు, సింహా, లెజెండ్ చిత్రాల్లో ద్విపాత్రాభిన‌యం చేసి మెప్పించారు. అలాగే `వీర సింహారెడ్డి` కి ముందు వ‌చ్చిన `అఖండ‌` సినిమాలోనూ బాల‌య్య ద్విపాత్రాభిన‌యం చేశాడు. బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ సినిమాల్లో డ్యూయల్ రోల్ లో నటించిన రికార్డు బాలకృష్ణ సొంతం.