తాడికొండలో మరో ట్విస్ట్..శ్రీదేవికి క్లారిటీ.!

వైసీపీ అధికారంలోకి వచ్చాక త్వరగా ప్రజా వ్యతిరేకత ఎదురుకున్న ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే..డౌట్ లేకుండా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అని చెప్పవచ్చు. అమరావతి ప్రాంతంలో ఉన్న ఈ నియోజకవర్గంలో శ్రీదేవి త్వరగా వ్యతిరేకత తెచ్చుకున్నారు. అక్కడ ప్రజా సమస్యలని గాలికొదిలేయడం..అందుబాటులో లేకపోవడం..ఇంకా పలు వివాదాల్లో ఉండటం వల్ల శ్రీదేవికి పెద్ద మైనస్ అయింది. ఇక నెక్స్ట్ ఎన్నికల్లో తాడికొండలో శ్రీదేవికి సీటు ఇస్తే డౌట్ లేకుండా ఓడిపోతారని సర్వేలు కొడై కూశాయి.

దీంతో జగన్ వెంటనే అలెర్ట్ అయ్యారు..ఆమె ప్లేస్‌ని ఎలాగైనా రీప్లేస్ చేయాలని చెప్పి ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ని అదనపు సమన్వయకర్తగా నియమించారు. ఆ సమయంలో జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా శ్రీదేవి వర్గం గళం విప్పింది. అప్పుడు గుంటూరు జిల్లా అధ్యక్షురాలుగా ఉన్న సుచరిత ఇంటివద్ద ఆందోళనలు చేశారు. అయినా సరే నిర్ణయం మారలేదు. దీంతో నెక్స్ట్ శ్రీదేవికి సీటు లేదని ప్రచారం మొదలైపోయింది. అయితే ఇదే సమయంలో తాజాగా తాడికొండ విషయంలో జగన్ మరొక సంచలన నిర్ణయం తీసుకున్నారు.

వైసీపీ తాడికొండ నియోజకవర్గ అదనపు సమన్వయకర్తగా కత్తెర సురేష్‌ కుమార్‌ను నియమిస్తూ పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. గతంలో ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ను అదనపు సమన్వయకర్తగా ఆ పార్టీ అధిష్టానం నియమించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయనను పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. దీంతో డొక్కా స్థానంలో కత్తెరను నియమించారు.

అయితే ఇలా తాడికొండలో ట్విస్ట్‌లు వస్తున్నాయి. అసలు చివరికి ఈ సీటు శ్రీదేవికి దక్కుతుందా లేదా డొక్కాకు ఇస్తారా? అనేది క్లారిటీ లేదు. అటు ఎంపీ నందిగం సురేశ్ సైతం ఈ సీటు కోసం ట్రై చేస్తున్నారు. దీంతో తాడికొండ సీటులో క్లారిటీ లేదు. ఇక ఎవరికి సీటు ఇచ్చిన ఇక్కడ అమరావతి ప్రభావం వల్ల వైసీపీకి నష్టం జరిగే ఛాన్స్ ఉంది.