గంటా కాపు రాజకీయం..బెనిఫిట్ ఎవరికి?

ఏపీలో గంటా శ్రీనివాసరావు చేసే రాజకీయాలు ఎవరికి అర్ధంకావు అని చెప్పవచ్చు. ఆయన ఏ సమయంలో ఎలాంటి రాజకీయం చేస్తారో తెలియదు..అలాగే ఆయన పార్టీ మార్పులు కూడా పెద్ద మిస్టరీగా ఉన్నాయి. ఇప్పటివరకు వరుసగా పార్టీలు మారడం, నియోజకవర్గాలు మార్చడం గెలవడం గంటాకు అలవాటైన పని. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గంటా..ఆ పార్టీ అధికారంలో లేకపోయేసరికి …ఇంకా టీడీపీలో అసలు కనిపించట్లేదు.

రాజకీయంగా కూడా కనిపించలేదు..కానీ తెరవెనుక మాత్రం రాజకీయాలు నడిపిస్తూనే ఉన్నారు. పైగా ఆయన పదే పదే పార్టీ మారిపోతున్నారని కథనాలు వస్తూనే ఉన్నాయి గాని…ఇంతవరకు పార్టీ మారింది లేదు. ఇటీవల కూడా గంటా టీడీపీని వదిలి..వైసీపీలోకి వెళ్లిపోతున్నారని, ఇంకా ముహూర్తం కూడా ఫిక్స్ అయిందని, జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇక ఈ సారి మాత్రం గంటా జంపింగ్ ఖాయమని అంతా అనుకున్నారు. ఎలాగో ఆయన టీడీపీలో ఉండటలేదు. కాబట్టి టీడీపీ వాళ్ళు ఆయన ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని లైట్ తీసుకున్నారు.

కానీ గంటా మాత్రం పార్టీ మారే విషయంలో మళ్ళీ బాంబు పేల్చారు. తాను చివరి వరకు చంద్రబాబుతోనే ఉంటానని, టీడీపీని వీడనని, మీడియా వాళ్లే తాను పార్టీ మారుతున్నట్లు ప్రచారం చేశారని చెప్పి క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ అలాంటిదేమైనా ఉంటే మీడియాకు చెబుతానని మళ్ళీ బాంబు పేల్చారు.

అదే సమయంలో ఈ నెల 26న వంగవీటి 34వ వర్ధంతితో పాటు కాపునాడు బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా నాయకులంతా హాజరుకావాలని గంటా పిలుపునిచ్చారు. ఇలా కాపు నాడు తెరపైకి రావడంతో..కాపులని ఏకతాటి పైకి తెచ్చే కార్యక్రమం జరుగుతుందని అర్ధమవుతుంది. అలా ఏకమయ్యేలా చేసి..ఏ పార్టీకి లబ్ది చేకూరేలా ప్లాన్ చేస్తున్నారో క్లారిటీ లేకుండా ఉంది. మరి చూడాలి గంటా రాజకీయం రాను రాను ఎలా మారుతుందో.