రాజధాని వ్యూహం..ఆ రెండే జగన్ టార్గెట్..!

అధికారంలోకి రాగానే జగన్..అమరావతిని రాజధానిగా కాదు అని..మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అమరావతిని శాసన రాజధానిగా చేసి..విశాఖని పరిపాలన రాజధానిగా, కర్నూలుని న్యాయ రాజధానిగా చేయాలని డిసైడ్ అయ్యారు. అయితే నిర్ణయం తీసుకుని మూడేళ్లు అయింది..కానీ మూడేళ్లలో మూడు రాజధానుల కోరిక నెరవేరలేదు. ఈ రాజధాని అంశంపై ఈ మూడేళ్లు ఎలాంటి రచ్చ నడిచిందో అందరికీ తెలిసిందే.

మొత్తానికి రాష్ట్రానికి రాజధాని ఏది అంటే చెప్పలేని పరిస్తితి ఏపీ ప్రజలకు వచ్చింది. ఇలా రాజధానిపై రగడ నడుస్తోంది. అయితే ఎన్నికల దగ్గరపడుతున్న నేపథ్యంలో జగన్ ఖచ్చితంగా మూడు రాజధానుల నినాదంతోనే ఎన్నికలకు వెళ్లనున్నారు. అటు చంద్రబాబు ఒకే రాజధాని అది..అమరావతి అనే నినాదంతో ముందుకెళ్లనున్నారు. ఇక ఇందులో ఎవరు గెలుస్తారనేది ప్రజలు నిర్ణయిస్తారు. అయితే ప్రజల మద్ధతు పొంది మళ్ళీ అధికారంలోకి వచ్చి మూడు రాజధానులని అమలు చేయాలనేది జగన్ కోరిక. ఆ దిశగానే రాజకీయం నడిపిస్తున్నారు.

ఇదే క్రమంలో మూడు రాజధానుల నిర్ణయం సక్సెస్ అవ్వాలంటే..ప్రధానంగా కృష్ణా-గుంటూరు జిల్లాల్లో మెజారిటీ సీట్లు గెలవాలి.  అప్పుడే ప్రజలు మూడు రాజధానులకు మద్ధతుగా ఉన్నారని భావించవచ్చు. ముఖ్యంగా అమరావతి ప్రాంతం పరిధిలో ఉన్న తాడికొండ, మంగళగిరి స్థానాల్లో గెలుపుని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గత ఎన్నికల్లో ఈ రెండు స్థానాలని వైసీపీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

కానీ తర్వాత తర్వాత ఈ రెండు చోట్ల వైసీపీపై వ్యతిరేకత పెరిగింది. ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత కూడా గట్టిగా కనిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్తితుల్లో ఈ రెండు చోట్ల వైసీపీ గెలుపు అనేది చాలా కష్టమైన పని. అందుకే జగన్ ఈ రెండు చోట్ల కొత్త ప్లాన్ వేస్తున్నారు. ఈ రెండు చోట్ల కొత్త అభ్యర్ధులని పెట్టడానికి చూస్తున్నారు. తాడికొండ సీటు ఈ సారి ఎమ్మెల్యే శ్రీదేవికి దక్కని పని.. ఈ సీటు డొక్కా మాణిక్యవరప్రసాద్‌కు గాని, కత్తెర సురేశ్‌కు గాని దక్కుతుందని తెలుస్తోంది. అటు ఆళ్ళ రామకృష్ణారెడ్డిని సత్తెనపల్లికి పంపి.మంగళగిరి సీటు గంజి చిరంజీవికి ఇవ్వాలని చూస్తున్నారు. కానీ ఎన్ని ప్రయోగాలు చూసిన రెండు చోట్ల వైసీపీ గెలవడం దాదాపు గగనమే.