తిరువూరు వైసీపీలో సెగలు..ఎమ్మెల్యేని ఓడిస్తామని సవాల్!

రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో అధికార వైసీపీలో ఆధిపత్య పోరు ఉన్న విషయం తెలిసిందే. అటు టీడీపీలో కూడా ఇలాంటి రచ్చ ఉంది..కానీ వైసీపీలో మరింత ఎక్కువ కనబడుతోంది. ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా అసమ్మతి రాగాలు వినిపిస్తున్నాయి. కొన్ని చోట్ల సీట్ల కోసం నేతల మధ్య రచ్చ నడుస్తోంది. ఇదే క్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని తిరువూరు వైసీపీలో అసమ్మతి రాగం తారస్థాయికి చేరుకుంది.

ఎమ్మెల్యే రక్షణనిధి, ఆయన బామ్మర్ది, వారి అనుచరుల అరాచకాలు పెరిగిపోయాయని..వైసీపీలో కొందరు నేతలు రగిలిపోతున్నారు. వారి వల్ల పార్టీ ఓడిపోయే పరిస్తితికి వచ్చిందని, ఇప్పటికే అధిష్టానానికి అనేకమార్లు ఫిర్యాదులు చేశారు. కానీ అధిష్టానం కూడా పట్టించుకోకపోవడంతో..అసమ్మతి వర్గం వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేని ఖచ్చితంగా ఓడించి తీరుతామని సవాల్ చేస్తుంది. నియోజకవర్గంలో ఎమ్మెల్యేల  కార్యక్రమాలను అడ్డుకోవాలని నిర్ణయానికి వచ్చింది. ఇందుకు ప్రజల మద్దతును కూడగట్టేందుకు గ్రామగ్రామాన క్రియాశీలంగా కృషి చేస్తోంది. ఇలా అసమ్మతి వర్గం దూకుడు పెరగడంతో వైసీపీ అధిష్టానం అలెర్ట్ అయింది.

అక్కడ పరిస్తితులని చక్కదిద్దడానికి మొదట మూడు జిల్లాల వైసీపీ కోఆర్డినేటర్‌ మర్రి రాజశేఖర్‌, రాజ్యసభ సభ్యుడు అయోధ్యరామిరెడ్డి తిరువూరు వచ్చి…ఎమ్మెల్యేని, అసమ్మతి వర్గాన్ని పక్కపక్కన పెట్టి విచారణ చేశారు. కానీ ఎమ్మెల్యే ఉండగా..తాము ఏమి మాట్లాడమని అసమ్మతి వర్గం సైడ్ అయింది. దీంతో సమస్య పరిష్కారం కోసం తాజాగా అదే జిల్లాకు చెందిన కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్ తుమ్మల చంద్రశేఖర్‌ని రాయబారిగా పంపారు. ఇక తాజాగా తిరువూరుకు వచ్చిన తుమ్మలకు..అసమ్మతి వర్గం..ఆధారాలతో సహ ఎమ్మెల్యే బామ్మర్ది, ఆయన అనుచరులు చేస్తున్న అక్రమాలని వివరించారని తెలిసింది.

ఇసుక, విద్యుత్‌ శాఖలో పోస్టుల అమ్మకాలు, అంగన్‌వాడీ స్కూళ్లలో పోస్టుల అమ్మకాలు, ఇసుక అమ్మకాలు, భూ కబ్జాలు లాంటి అంశాల్లో ఎమ్మెల్యే బామ్మర్ది, అనుచరులు ఉన్నారని..వైసీపీలోని అసమ్మతి వర్గం ఆరోపిస్తుంది. అందుకే ఎమ్మెల్యేని ఓడిస్తామని చెప్పి అసమ్మతి వర్గం అంటుంది. ఇక వైసీపీ అధిష్టానం ఎమ్మెల్యే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.