ఫిబ్ర‌వ‌రిలో కియారా-సిద్ధార్థ్ పెళ్లి బాజాలు.. డేట్, ప్లేస్ ఫిక్స్!?

బాలీవుడ్ లవ్ బర్డ్స్ కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా ప్రేమ‌లో ఉన్నార‌న్నది అంద‌రికీ తెలిసిన ర‌హ‌స్యం. అయితే వీరిద్ద‌రూ త‌మ బంధాన్ని మ‌రింత ముందుకు తీసుకెళ్లాల‌నే ఉద్ధేశంతో పెళ్లికి సిద్ధ‌మ‌య్యారంటూ గ‌త కొద్ది రోజులుగా బాలీవుడ్ మీడియాలో కోడై కూస్తోంది. అయితే తాజాగా ఈ ప్ర‌చారం మ‌రింత ఊపందుకుంది.

కొత్త ఏడాది ఈ జంట వైవాహిక జీవితంలో అడుగు పెట్ట‌బోతున్నార‌ని పెద్ద ఎత్తున వార్త‌లు వ‌స్తున్నాయి. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో కియారా-సిద్ధార్థ్ పెళ్లి బాజాలు మోగ‌బోతున్నాయ‌ట‌. ఇప్ప‌టికే మ్యారేజ్ డేట్ అండ్ ప్లేస్‌ను కుటుంబ‌స‌భ్యులు ఫిక్స్ చేసేశార‌ట‌. ఫిబ్రవరి 6వ తేదీన రాజస్థాన్ జైసల్మీర్ ప్యాలెస్‌లో కియారా-సిద్ధార్థ్ పెళ్లి అంగ‌రంగ వైభ‌వంగా జ‌ర‌గ‌బోతోంద‌ని బీటౌన్‌లో గట్టిగా టాక్‌ వినిపిస్తోంది.

ఫిబ్రవరి 4, 5 తేదీల్లో వివాహానికి సంబంధించిన హల్దీ, సంగీత్.. ఇతర కార్యక్రమాలు ముంబయిలో జర‌గ‌బోతున్నాయ‌ట‌. కేవలం కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్యే వీరి పెళ్లి జరగనుంది. ఆ తర్వాత ఢిల్లీలో గ్రాండ్ గా రిసెప్షన్ జరగనుంద‌ని అంటున్నారు. కాగా, గత కొన్ని రోజులుగా పార్టీలు, పబ్బులు, వెకేష‌న్స్ అంటూ కియారా-సిద్ధార్థ్ చట్టాపట్టాలేసుకుని తెగ తిరిగేస్తున్నారు. తాజాగా కూడా న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్ కోసం ఇద్ద‌రు క‌లిసి విదేశాల‌కు చెక్కేశారు.