టీడీపీలోకి వసంత..దేవినేనికి అదే టెన్షన్.?

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మైలవరం నియోజకవర్గంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారిపోయాయి. ఇక్కడ వైసీపీ-టీడీపీల మధ్య రాజకీయ యుద్ధం నడుస్తోంది. అదే సమయంలో రెండు పార్టీల్లో అంతర్గత యుద్ధం కూడా నడుస్తోంది. వైసీపీలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్..మంత్రి జోగి రమేష్ వర్గాల మధ్య రచ్చ నడుస్తోంది. అటు టీడీపీలో మాజీ మంత్రి దేవినేని ఉమా, టీడీపీ నేత బొమ్మసాని సుబ్బారావుల మధ్య పోరు నడుస్తోంది.

పెడన నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జోగి..వచ్చే ఎన్నికల్లో తన సొంత స్థానమైన మైలవరం నుంచి పోటీకి దిగాలని చూస్తున్నారని తెలిసింది. దీంతో ఎమ్మెల్యే వసంత సీటుకు ఎసరు వచ్చింది. ఇక జగన్ ఏది చెబితే అది చేస్తానని అంటున్నారు. కానీ జగన్ ఎవరికి సీటు ఇస్తారో క్లారిటీ ఇవ్వలేదు. అటు మైలవరం సీటు స్థానికులకే ఇవ్వాలని బొమ్మసాని టీడీపీలో డిమాండ్ పెట్టారు. దీంతో ఆయనపై దేవినేని వర్గం మండిపడుతుంది. ఇలా రెండు పార్టీల్లో రచ్చ నడుస్తోంది.

ఇక అదే సమయంలో తాజాగా వసంత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తాను చంద్రబాబుని తిట్టను అని, కానీ దేవినేనిని మాత్రం తిడతానని అంటున్నారు. దేవినేని కావాలని చెప్పి..తన చేత చంద్రబాబుని తిట్టించాలని చూస్తున్నారని, తాను టీడీపీలోకి వస్తాననే భయం దేవినేనికి ఉందని అంటున్నారు. కానీ తాను ఎట్టి పరిస్తితుల్లోనూ టీడీపీలోకి రానని వసంత చెబుతున్నారు.

బాబుని మాత్రం ఒక్క మాట అనని, ఆయన్ని తిట్టాల్సిన అవసరం లేదని వసంత అంటున్నారు. దీంతో మైలవరం రాజకీయాలు కన్ఫ్యూజ్ గా మారాయి. అసలు రెండు పార్టీల్లో క్లారిటీ లేని రాజకీయం నడుస్తోంది. ముందు రెండు పార్టీలు సీట్లు ఫిక్స్ చేస్తే అంతా క్లారిటీ వస్తుంది. కాకపోతే టీడీపీ సీటు దేవినేనికి కాకుండా మరొకరికి ఇవ్వడం జరిగే పని కాదు. మరి వైసీపీ సీటు ఎవరికి దక్కుతుందో చూడాలి.