అప్పలరాజుకు సొంత తిప్పలు..ఓడిస్తామని వార్నింగ్..!

మంత్రి సీదిరి అప్పలరాజుకు సొంత పార్టీలోనే అసమ్మతి పోరు పెరిగింది..ఎమ్మెల్యేగా గెలవడానికి సహకరించిన వారిని..మంత్రి అయ్యాక పట్టించుకోవడం మానేశారు. వారికి ప్రాధాన్యత కూడా ఇవ్వడం లేదని చెప్పి..పలాస నియోజకవర్గంలోని వైసీపీ అసమ్మతి వర్గం భగ్గుమంటుంది. గత ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి అప్పలరాజు గెలిచారు. అలాగే అదృష్టం కొద్ది మంత్రి పదవి కూడా వరించింది. ఇక పదవి వచ్చాక..తన శాఖకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో తెలియదు గాని..చంద్రబాబుపై మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వస్తున్నారు.

ఇక బాబుని తిట్టడానికే మంత్రి పదవి అన్నట్లు పరిస్తితి ఉంది. అలాగే పలాసలో టీడీపీ శ్రేణులని అణిచివేయడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. అక్కడ టీడీపీ ఇంచార్జ్ గౌతు శిరీషని టార్గెట్ చేసి నానా ఇబ్బందులు పెడుతున్నారు. అయితే ప్రతిపక్ష టీడీపీనే కాదు..సొంత పార్టీ వాళ్ళని కూడా అవమానిస్తున్నారట. తాజాగా మందస మండలం..దున్నూరు సముద్రతీరంలో వన భోజనాల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వైసీపీ జిల్లా కార్యదర్శి హేంబాబు, పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ కౌన్సిలర్లు దువ్వాడ శ్రీకాంత్, జుత్తు నీలకంఠం…కొందరు వైసీపీ కార్యకర్తలు హాజరయ్యారు.

ఆ కార్యక్రమంలో వైసీపీ నేతలు మంత్రి టార్గెట్ గా విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే కావడం కోసం అప్పుడు తమ సాయం తీసుకుని, ఇప్పుడు పక్కన పెట్టి అవమానిస్తున్నారని ఫైర్ అయ్యారు. మంత్రి అవినీతి, అక్రమాలపై వైసీపీ అధిష్టానం దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సారి గాని అప్పలరాజుకు సీటు ఇస్తే…తామే ఓడిస్తామని వార్నింగ్ ఇచ్చారు.

అయితే మంత్రి అయ్యాక అప్పలరాజుకు మైనస్సే పెరిగింది తప్ప..ప్లస్ కనిపించడం లేదు. పలాసలో కూడా నెగిటివ్ వస్తుందని తెలుస్తోంది. ఇప్పటికే అక్కడ టీడీపీ నిదానంగా బలపడుతుంది. ఇలాంటి సమయంలో సొంత పార్టీ వాళ్ళు కూడా అపోజిట్ అవుతున్నారు. దీని వల్ల అప్పలరాజుకు పలాసలో రిస్క్ తప్పదు.