చివరి ఛాన్స్‌తో వైసీపీ హ్యాపీ..కానీ రిస్క్..!

ప్రజలని సెంటిమెంట్‌తో ఆకట్టుకోవడం రాజకీయ నాయకులకు బాగా అలవాటు అయిపోయింది..ఎన్నికల్లో గెలవడానికి సెంటిమెంట్ అస్త్రాలని గట్టిగానే వాడుతారు. గత ఎన్నికల్లో జగన్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని ప్రజలని ఓట్లు అడిగారు. దీంతో ప్రజలు ఎలాగో చంద్రబాబుని చూశాం కదా..ఒక్కసారి జగన్‌ని చూద్దామని వైసీపీని భారీ మెజారిటీతో గెలిపించారు.

ఇక జగన్ పాలన ఎలా ఉందో ప్రజలు చూస్తున్నారు..జగన్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారో లేక..వైసీపీ వాళ్ళు సంతోషంగా ఉన్నారో..ప్రజలకే క్లారిటీ తెలియాలి. ఆ విషయం పక్కన పెడితే..తాము అంతా మంచి చేశామని, 175కి 175 సీట్లు ఎందుకు గెవలేమని జగన్ అంటున్నారు..అలాగే ఈ ఒక్క సారి గెలిస్తే మరో 30 ఏళ్ల పాటు మనదే అధికారమని అంటున్నారు. ఇది జగన్ వర్షన్.

ఇటు చంద్రబాబు వర్షన్ వచ్చేసరికి..జగన్ వల్ల రాష్ట్రం నాశనమైపోయిందని, మళ్ళీ తాను అధికారంలోకి వస్తే గాడిలో పెడతానని, జగన్ మాదిరిగా అప్పులు చేసి కాకుండా, ఆదాయం  సృష్టించి ఇప్పుడున్న పథకాలతో పాటు, ఇంకా మెరుగ్గా అమలు చేస్తానని, అభివృద్ధి చేస్తానని, ఈ సారి గాని గెలిపించుకోలేకపోతే ఇవే చివరి ఎన్నికలు అని అన్నారు. అటు పవన్ సైతం తమకు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతున్నారు.

ఇలా ఎవరికి వారే ఛాన్స్‌లు అడుగుతున్నారు..అయితే ఇప్పుడు బాబు చివరి ఛాన్స్ అన్నదానిపై చర్చ నడుస్తోంది..దీనిపై వైసీపీ నేతలు ఎగతాళి చేస్తున్నారు..బాబు కోరిక నెరవేరుతుందని తథాస్తు అంటున్నారు. బాబుకే కాదు టీడీపీకి కూడా చివరి ఎన్నికలు అని అంటున్నారు. అంటే ఇక బాబు పని అయిపోయిందని వైసీపీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కానీ వారు ఇదంతా పైకి చెబుతున్నారా? అనే డౌట్ ఉంది. ఎందుకంటే బాబు తనకు చివరి ఎన్నికలు అని సెంటిమెంట్‌తో వస్తున్నారు..దీనికి జనం కరిగే అవకాశం కూడా ఉంటుంది..తాజాగా కర్నూలు జిల్లాలో బాబు పర్యటనలకు జనం నుంచి వస్తున్న స్పందనే దానికి ఉదాహరణ. కాబట్టి చివరి ఛాన్స్ అని ఎగతాళి చేయకుండా, కాస్త వైసీపీ అలెర్ట్ గా ఉంటే బెటర్.