కంచుకోట లాంటి నియోజకవర్గాలని తెలుగుదేశం పార్టీ నేతలు చేతులారా నాశనం చేస్తున్నారు..గత ఎన్నికల్లో జగన్ దెబ్బకు పలు టీడీపీ కంచుకోటలు బద్దలయ్యాయి. సరే అప్పుడు జగన్ వల్ల దెబ్బతింటే..ఇప్పటికీ కొన్ని స్థానాల్లో టీడీపీ బలం పెరగడం లేదు. దానికి కారణం స్వయంగా తెలుగు తమ్ముళ్లే అని చెప్పొచ్చు. ఎక్కడకక్కడ ఆధిపత్య పోరు వల్ల పలు కంచుకోటల్లో టీడీపీ బలపడటం లేదు.
అలా బలపడని కంచుకోటల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు కూడా ఒకటి..ఇది పక్కా టీడీపీ కంచుకోట..1983 నుంచి చూసుకుంటే 1999, 2019 ఎన్నికల్లోనే కొవ్వూరులో టీడీపీ ఓటమి పాలైంది. అంటే కొవ్వూరు టీడీపీ కంచుకోట అని క్లియర్ గా అర్ధమవుతుంది. అయితే 2019 ఎన్నికల నుంచి ఇక్కడ టీడీపీ పరిస్తితి బాగోలేదు. ఇక్కడ వర్గాల పోరు వల్ల టీడీపీకి ఇంచార్జ్ లేరు..బలం లేదు. 2014లో ఇక్కడ కేఎస్ జవహర్ గెలిచి..మంత్రిగా చేశారు. అప్పుడు ఓ వర్గాన్ని జవహర్ పట్టించుకోలేదు.
ఆ వర్గమే 2019లో జవహర్‌కు సీటు రాకుండా చేసింది..దీంతో జవహర్‌ని తిరువూరుకు పంపారు. ఇటు కొవ్వూరులో అనితని నిలబెట్టారు. జగన్ వేవ్‌లో ఇద్దరు ఓడిపోయారు. ఓడిపోయాక అనిత తన సొంత స్థానం పాయకరావుపేటకు వెళ్ళిపోయారు. ఇటు జవహర్..కొవ్వూరుకు వచ్చారు. కానీ అక్కడ ఆయన్ని ఓ వర్గం వ్యతిరేకిస్తుంది. దీంతో ఇంచార్జ్ పదవి ఇవ్వలేదు. ఇప్పటికీ వర్గ పోరు నడుస్తోంది. డిసెంబర్ 1న నియోజకవర్గంలో చంద్రబాబు టూర్ సందర్భంగా సభ ఏర్పాటు చేయనున్నారు.
ఈ సభా వేదికపైకి వచ్చే నేతల పేర్లని బుచ్చయ్య చౌదరీ ఆధ్వర్యంలోని టీం నమోదు చేసింది. అయితే ఆ పేర్లలో జవహర్ పేరు లేదు. దీంతో జవహర్ వర్గం మండిపడింది..జవహర్ సైతం బుచ్చయ్య టీంతో గొడవకు దిగారు. అటు జవహర్‌కు వ్యతిరేకంగా ఓ వర్గం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఇటు జవహర్ వర్గం..జై జవహర్ అంటూ నినదించారు. ఇలా రెండు వర్గాల మధ్య రచ్చ జరిగింది. ఈ విధంగా కొవ్వూరులో తమ్ముళ్ళ రచ్చ నడుస్తోంది. దీని వల్ల కొవ్వూరులో టీడీపీ పరిస్తితి దారుణంగా ఉంది.