అటు పెడన..ఇటు మైలవరం..జోగి చిచ్చు..!

ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీలో ఉన్న ఫైర్ బ్రాండ్ నాయకుల్లో మంత్రి జోగి రమేష్ కూడా ఒకరనే సంగతి తెలిసిందే..జగన్‌కు వీర విధేయుడుగా ఉన్న జోగికి రెండోసారి మంత్రి వర్గ విస్తరణలో పదవి దక్కిన విషయం తెలిసిందే. మంత్రి పదవి దక్కాక..తన శాఖకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో తెలియదు గాని..ప్రత్యర్ధులైన చంద్రబాబు, పవన్‌లపై ప్రతిరోజూ ప్రెస్ మీట్ పెట్టి మరీ విరుచుకుపడుతున్నారు. అలా మంత్రిగా ముందుకెళుతున్నారు.

ఇక మంత్రిగా ఉంటూ తాను ప్రతినిధ్యం వహిస్తున్న పెడనలో గొప్ప గొప్ప అభివృద్ధి కార్యక్రమాలు కూడా పెద్దగా చేయట్లేదు. అటు సొంత గడ్డ మైలవరంకు కూడా చేసేదేమీ లేదన్నట్లే ఉంది. కానీ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే..రెండుచోట్ల సొంత నేతలతో విభేదాలు మాత్రం ఉన్నాయి. దీని వల్ల అటు పెడనలో, ఇటు మైలవరంలో వైసీపీలో చిచ్చు రేగుతుంది. అసలు జోగి సొంత స్థానం మైలవరం..2014లో ఇక్కడ పోటీ చేసి ఓడిపోయారు.

2019లో మాత్రం జగన్ వ్యూహం మార్చి..జోగిని పెడనలో నిలబెట్టి, మైలవరంలో వసంత కృష్ణప్రసాద్‌కు సీటు ఇచ్చారు. జగన్ వేవ్‌లో ఇద్దరు గెలిచేశారు. అయితే మొదట నుంచి పెడనలో జోగికి..వైసీపీ నేత ఉప్పాల రామప్రసాద్‌కు పడని పరిస్తితి..రెండు వర్గాలు ఉప్పు-నిప్పు మాదిరిగా ఉంటాయి. ఇక జోగి మంత్రి అవ్వడం, అటు ఉప్పాల కోడలు హారిక జెడ్పీ చైర్‌పర్సన్ అవ్వడంతో ఆధిపత్య పోరు మరింత ముదిరింది.

పెడనలో అలా ఉంటే..ఈ మధ్య మైలవరంలో కూడా ఎమ్మెల్యే వసంత, జోగి వర్గాలకు పడటం లేదట. మైలవరంలో జోగి పెత్తనం చేస్తున్నారని వసంత వర్గం ఫైర్ అవుతుంది. వసంతకు వ్యతిరేకంగా జోగి వర్గం సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతుంది..దీనిపై వసంత వైసీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అయితే ఈ విధంగా జోగితో రెండు చోట్ల వైసీపీలో ఆధిపత్య పోరు నడుస్తోంది.