ప్రస్తుతం మన మధ్య నుంచి దూరమైన సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ సినీ జీవితంలో అనేక మధురమైన ఘట్టాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైంది. అన్నగారు.. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్‌తో కలిసి నటించిన సినిమాలు. వాస్తవానికి అన్నగారితో కృష్ణకు విభేదాలు ఉన్నాయి. అయితే.. ఈ విభేదాలు రాకముందే.. అన్నగారు.. కృష్ణ కలిసి నటించారు. ఈ ఇద్దరి కాంబినేషన్ కూడా అదిరిపోయే రేంజ్లో సాగడం గమనార్హం.
సహజంగానే ఇద్దరు హీరోలకు కూడా అభిమాన సంఘాలు దండిగా ఉన్నాయి. అలాంటప్పుడు.. ఇద్దరు కూడా ఆలోచిస్తారు. ఎవరూ ఎక్కువ కాకుండా.. ఎవరూ తక్కువ కాకుండా ఉండేలా పాత్రలను ఎంచుకుంటారు. కానీ, ఎన్టీఆర్-కృష్ణల విషయంలో మాత్రం మల్టీ స్టారర్ మూవీలను ఎలా తీసినా.. ప్రజలు ఆదరించారు. అంతేకాదు.. ఎన్టీఆర్-కృష్ణ కాంబినేషన్‌కు కొబ్బరి కాయ కొట్టా రంటే.. మూవీ వచ్చే వరకు పండగే పండగ. అలా ఉండేది ఆ రోజుల్లో.
గ్రామాల నుంచి సైతం బళ్లు కట్టుకుని పట్నాలకు వచ్చి సినిమాలు చూసేవారు. నిజానికి కృష్ణ-శోభన్‌బాబు, కృష్ణంరాజు కాంబినేషన్ కూడా బాగానే ఉండేది. అయితే, అన్నగారితో కృష్ణ అంటే.. మాత్రం ప్రేక్షకులకు, అభిమానులకు మాత్రం పూనకం వచ్చేసేదట. ఇలా.. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు.. సూపర్ హిట్లు కొట్టాయి. ‘పాతాళభైరవి’ సినిమాలోని ఎన్టీఆర్ నటనకు ముగ్దుడైన కృష్ణ.. ఆయనతోనే కలిసి నటించే అవకాశం రావడం గురించి ప్రత్యేకంగా చెప్పేవారు.
ఎన్టీఆర్‌తో కలిసి కృష్ణ నటించిన తొలి సినిమా ‘స్త్రీ జన్మ’. తర్వాత, ఈ కాంబినేషన్లో ‘నిలువు దోపిడి’, ‘విచిత్ర కుటుంబం’, ‘దేవుడు చేసిన మనుషులు’, ‘వయ్యారి భామలు-వగలమారి భర్తలు’ సినిమాలొచ్చాయి. ఈ ఐదు చిత్రాల్లోనూ ఈ ఇద్దరు హీరోలు సోదరులుగా నటించడం విశేషం. ఈ సినిమాలు ఎంత హిట్ కొట్టాయో.. అందరికీ తెలిసిందే.